
పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు ధర్మాన రామ్‌మనోహరనాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను వైద్య విద్యకి దూరం చేసే విధానాలు ప్రభుత్వం విడనాడాలని కోరారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని విన్నవించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గమని మండిపడ్డారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వం, మెడికల్ కాలేజీల కోసం అవసరమైన నిధులు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తైక్వాండో శ్రీను, డా.కంఠ వేణు, ఎస్.వి.రమణ మాదిగ, మహిబుల్లా ఖాన్, అమిరుల్లా బేగ్, రౌతు శంకరరావు, బాడాప దేవభూషణరావు, గుండబాల మోహన్, ఎంఏ బేగ్, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, యజ్జల గురుమూర్తి, వైశ్యరాజు మోహన్, గద్దెబోయిన కృష్ణారావు, నీలాపు ముకుందరావు, నల్లబారిక శ్రీను, పెయ్యల చంటి, అబ్బాస్, సింకు రమణ, అరిబారిక రాజు, నేతల అప్పారావు, కొత్తూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.