
ఏడు సమితుల పరిధిలో ఆది కర్మయోగి కార్యక్రమాలు
పర్లాకిమిడి: వికసితభారత్‌త్, వికసిత్ జిల్లా విజన్–2030 లక్ష్యంగా గజపతి జిల్లాలో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమాలను ఏడు సమితి కేంద్రాలు, 435 గ్రామాలలో 8,700 మంది ఆదిసాథీలతో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ మధుమిత వెల్లడించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. గిరిజన, ఆదివాసీ ప్రజలకు మౌలిక సమస్యలు, విద్య, వైద్య, రవాణా, తాగునీరు, అంగన్‌వాడీ, పోషక ఆహారం, స్వయం ఉపాధికి పథక రచన చేస్తున్నామని అన్నారు. ఇదోక నూతన ప్రక్రియ అని, ప్రముఖ ఆదివాసీ మహిళ బిర్షా ముండా 140 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ సంప్రదాయ గ్రామాలు వికాసానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం ప్రవేశపెట్టారని కలెక్టర్ అన్నారు. దేశంలో 30 రాష్ట్రాలు, 550 జిల్లాలు, 300 కంటే ఎక్కువ సమితి కేంద్రాల్లో, ఒక లక్ష గ్రామాలు 2030 లోగా వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దడానికి నడుం కట్టారని అన్నారు. గజపతి జిల్లాలో ఏడు సమితి కేంద్రాలు, 435 గ్రామాల్లో ఐదు సామాజిక సేవాకేంద్రాలు నిర్మిస్తున్నామని అన్నారు. దీనికోసం జిల్లాలో 8,700 మంద ఆదిసాథీలను నియమించామని కలెక్టర్ అన్నారు. సెప్టెంబర్ 27 నుంచి గాంధీ జయంతి వరకూ ఆదికర్మయోగి అభియాన్ ప్రోగ్రెస్‌ను తెలియజేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్‌వో కె.నాగరాజు, ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి అంఽశుమాన్ మహాపాత్రో పాల్గొన్నారు.