
ఇలా కట్టారు..అలా కూలింది..
● కాలువ పనుల్లో బయటపడిన డొల్లతనం
● కానరాని అధికారుల పర్యవేక్షణ
టెక్కలి: కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి పది కాలాల పాటు ఉండాల్సిన నిర్మాణాలు రోజుల వ్యవధిలోనే కూలిపోతున్నాయి. టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో మండపొలం కాలనీ వద్ద పాత జాతీయ రహదారికి ఆనుకుని చేపడుతున్న మురుగు నీటి కాలువ నిర్మాణంలో నాణ్యత లేని పనుల డొల్లతనం బయటపడింది. సుమారు రూ.1.98 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో ఈ కాలువ నిర్మాణం చేపడుతున్నారు. ఓవైపు పనులు చేస్తుండగానే మరో వైపు కాలువ గోడలు కూలిపోతున్నాయి. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కాలువ నిర్మాణాలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు ఈ పనులు చేస్తుండడంతో అధికారులు తమకేమీ పట్టనట్లుగా కనీసం పర్యవేక్షణ చేయడం మానేశారు. దీంతో కాలువ పనులు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.