
రూ.లక్ష పలికిన లడ్డూ
వజ్రపుకొత్తూరు: కొండవూరులో వేద సరస్వతీ దేవి 28వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి ఉత్సవాల్లో అమ్మవారి లడ్డూ పాట రూ.100500 పలికింది. శనివారం రాత్రి నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన కోనారి రాజశేఖర్ లడ్డూను కై వసం చేసుకున్నారు. దేవీ వస్త్రాన్ని రూ.17001లకు లండ నరేష్ దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
టీ–10 భారత్ జట్టుకు
ఈశ్వర్‌రెడ్డి ఎంపిక
టెక్కలి రూరల్: అంతర్జాతీయ స్థాయి సెకండ్ ఏషియన్ టీ–10 ఇండియా క్రికెట్ జట్టుకు కోటబొమ్మాళి గ్రామానికి చెందిన మూగి ఈశ్వర్‌రెడ్డి ఎంపికై నట్లు అసోషియేషన్ ప్రతినిధులు సుకుమార్, రాంబాబు ఆదివారం తెలిపారు. థాయిలాండ్‌లో పోటీలు జరుగుతాయని, సుమారు రూ.లక్షా 50వేలు ఖర్చు అవు తుందని ఈశ్వరరెడ్డి చెప్పారు. తనది పేద కుటుంబమని, దాతలు సహకరించాలని, వివరాలకు 9493740222 సంప్రదించాలని కోరారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఇచ్ఛాపురం రూరల్: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. పొట్ట కూటి కోసం ఇతర ప్రాంతానికి వెళ్లి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తేలుకుంచి గ్రామానికి చెందిన మేరుగు త్రినాథ్(55) ఇతర ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య వరలక్ష్మీ, పెళ్లీడుకొచ్చిన కుమార్తె శారద ఉంది. ఆదివారం విశాఖపట్నంలో కూలి పనుల కోసం బయల్దేరిన త్రినాథ్ ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో బెర్హంపూర్–విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లాట్ ఫాం మధ్య పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో సీహెచ్‌సీకి తరలించగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఉద్యోగుల సమస్యలు
పరిష్కరించాలి
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.రమణమూర్తి డిమాండ్ చేశారు. నగరంలోని క్రాంతి భవన్‌లో ఆదివారం సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల కార్యాచరణలో భాగస్వామ్యం వహించే ఉద్యోగులను పాలకులు చిన్నచూపు చూడటం తగదన్నారు. డీఏలు సకాలంలో విడుదల చేయాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని, పీఆర్‌సీ అమలయ్యే వరకు ఐఆర్ ప్రకటించాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి జి.రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యోగులకు ఇటీవలే డీఏ ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండేళ్లుగా డీఏలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలపై ప్రభుత్వం రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో కలిసి ఐక్య ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘ నాయకులు పి.ప్రభాకరరావు, ఎం.సన్యాసిరావు, పి.రామకృష్ణ, రాజేశ్వర రావు, జి.శ్రీనివాసరావు, జి.తిరుమలరావు, సీహెచ్ జగన్, రామచంద్రరావు పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
కంచిలి: సూదిపుట్టుగ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు శనివారం రాత్రి దాడిచేశారు. గ్రామానికి చెందిన ప్రేమ్ దొళాయి అనే వ్యక్తికి చెందిన ఇంటి టెర్రస్‌పై రేకుల గదిలో కోతముక్కల పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు సిబ్బందితో వెళ్లారు. ప్రేమ్ దొళాయితోపాటు మరో 12 మందిని అదుపులోకి తీసుకున్మనారు. వీరి వద్ద నుంచి రూ.92,960 నగదు, 13 మొబైల్ ఫోన్లు, 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

రూ.లక్ష పలికిన లడ్డూ

రూ.లక్ష పలికిన లడ్డూ

రూ.లక్ష పలికిన లడ్డూ