
విలయానికి నలుగురు బలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఈనెల 2న ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు రాయగడ బ్లాక్ మర్లబ పంచాయతీ పెక్కట గ్రామంలో తండ్రీకొడుకులు కార్తీక్ శోబోరో, రాజిక్ శోబోరో బండరాళ్లు, బురదలో కూరుకుపోయి మరణించగా మరో ఇద్దరు గిరిజనులు కనబడకుండా పోవడంతో వారు కూడా మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మూడు రోజులుగా వారి మృతదేహాలు వెతుకుతున్నా, ఇంతవరకూ ఓడ్రాఫ్ సిబ్బందికి దొరకలేదు. అలాగే ఆర్.ఉదయగిరి బ్లాక్ బస్త్రి గుడలో త్రినాథ్ నాయక్(45) బండరాళ్ల కింద పడిపోవడంతో కనిపించకుండాపోయాడని అధికారులు నిర్ధారించారు. పది అడుగుల మేరకు బురద, కొండరాళ్లు కప్పివేయడంతో ఓడ్రాఫ్ సిబ్బందికి, పోలీసులకు ఇంతవరకూ దొరకలేదు. ఆర్.ఉదయగిరి బీడీఓ లారీమాన్ ఖర్సల్ శనివారం బస్త్రిగుడ గ్రామం సందర్శించారు. కొండ చరియలు విరిగి పడి ఉన్న ప్రాంతం అతి భయానకంగా పొగతో కప్పి ఉండటం గమనించారు. కనిపించకుండాపోయిన త్రినాథ్ నాయక్ కుటుంబానికి బీడీఓ రూ. 20 వేల తక్షణ సహాయం అందజేశారు. బరంపురం ఎంపీ డాక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి మృతుల కుటుంబాలని పరామర్శించారు. మోహన బ్లాక్‌లో కనిపించకుండా పోయిన లక్ష్మణ్ మల్లిక్ కుటుంబాన్ని కూడా పరామర్శించి వారి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ.20 వేలు అంద జేశారు. మోహన బ్లాక్‌లో బందగుడ గ్రామానికి చెందిన లక్ష్మణ్ మల్లిక్(40) చనిపోవడంతో వారి ఇద్దరు కూతుళ్లకు ప్రభుత్వమే వారి బాగోగులు, ఉన్నత విద్యకోసం తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎంపీ ప్రదీప్ పాణిగ్రాహి మోహన, ఆర్.ఉదయగిరి, రాయఘడ సమితి కేంద్రాల్లో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్ని సందర్శించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాయగడ బ్లాక్‌లో కొండ చరియలు విరిగి పడిన సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో ఇద్దరు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతామన్నారు.

విలయానికి నలుగురు బలి