
తేనెటీగల దాడి
● ఆరుగురికి తీవ్రగాయాలు
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి బలిగాం పంచాయతీ లకమలియగుడ గ్రామానికి చెందిన డుము శాంత దసరా సెలవుల్లో తన భార్య, ముగ్గురు కుమారులను బాగరంగిణిగుడ గ్రామంలోని అత్తవారింట్లో విడిచి వచ్చాడు. పిల్లలకు సెలవులు పూర్తి కావొస్తుండడంతో వారిని తీసుకొచ్చేందుకు శుక్రవారం డుము శాంత బాగరంగిణిగుడ గ్రామానికి వెళ్లాడు. అనంతరం భార్యా, పిల్లలతో శనివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామానికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో హటగుడ గ్రామ కూడలి వద్ద అకస్మాత్తుగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. అది చూచిన డుము శాంత బైక్ విడిచి భార్యా, పిల్లలతో సమీప మొక్కజొన్న తోటలోనికి పారిపోయారు. వారు భయంతో హాహాకారాలు చేశారు. వారి ఆర్తనాదాలు విన్న సమీపంలో పశువులు మేపుతున్న కొంతమంది వారి వద్దకు వస్తుండగా వారిపైన కూడా తేనెటీగలు దాడి జరిపాయి. తేనెటీగల దాడిలో డుము శాంత కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఉన్నవారు వచ్చి తేనెటీగల దాడిలో గాయపడిన వారిని బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్‌కు చేర్చారు. హాస్పిటల్‌లో వారు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.