
కుంద్ర సమితి అధ్యక్షురాలి రాజీనామా
జయపురం: సబ్ డివిజన్ కుంధ్రా పంచాయతీ సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి పొరజ తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందే తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను ఆమె జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్య రెడ్డికి శనివారం అందజేశారు. అలాగనే రాజీనామా లేఖ ప్రతిని కుంధ్ర బీడీవో పి.మనస్మితకు కూడా అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పంచాయతీ సమితి అధ్యక్షురాలైన తాను గత నాలుగేళ్లలో సమర్దవంతంగా విధులు నిర్వర్తించానని తెలిపారు. అయితే వ్యక్తిగత కారణాల వలన పదవీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేనని తెలుపుతూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా సమితిలోని కాంగ్రెస్ మద్దతుదారులైన కొంతమంది సర్పంచ్‌లు, సమితి సభ్యులు ఆమైపె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు సర్పంచ్‌లు, ముగ్గురు సమితి సభ్యులతో పాటు 40 మంది కార్యకర్తలు పార్టీని విడిచారు. అనంతరం సమితిలోని 32 మంది సమితి సభ్యులు, సర్పంచ్‌లు సమితి ఆమైపె పలు ఆరోపణలు చేస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో అధికారులు ఓటింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఆమె రాజీనామా చేయడం గమనార్హం.