
శ్రీమందిరంలో కార్తీక సేవలు ప్రారంభం
● రాధా దామోదర అలంకరణ
● ఈ నెల 7 నుంచి కార్తీక వ్రతం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని దేవస్థానంలో కార్తీక మాసం ప్రత్యేక సేవాదులు ప్రారంభించారు. శుక్రవారం పవిత్ర అశ్విని శుక్ల పక్ష ఏకాదశి తిథి పాపాంకుశ ఏకాదశి నుండి కార్తీక శుక్ల దశమి వరకు ఈ సేవలు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ సందర్భంగా రత్న వేదికపై శ్రీ మందిరంలో దేవతా త్రయానికి రాయ్ దామోదర అలంకరణ నిర్వహిస్తారు. నిత్యం ప్రాతః శుద్ధి (ఒబొకాసొ) వెంబడి మూల విరాట్లకు రత్న సింహాసనంపై రాధా దామోదర అలంకరణ లేదా రాయ్ దామోదర అలంకరణ చేస్తారు. మరో వైపు కార్తీక వ్రతం, బాల ధూపం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమాలు నిరవధికంగా నెల రోజులపాటు కొనసాగుతాయి. కార్తీక మాసంలో శ్రీ జగన్నాథుడిని (విష్ణువు) దామోదరుడిగా పూజిస్తారు. ఈ సందర్భంగా చేసే అలంకరణను రాధా దామోదర అలంకరణగా పేర్కొంటారు. శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టరు అరవింద కుమార్ పాఢి అధ్యక్షతన జరిగిన ఛొత్తీషా నియోగుల సమావేశంలో కార్తీక మాసం ప్రత్యేక సేవాదుల కార్యక్రమాలు ఖరారు చేశారు. ఈ సమావేశంలో నిర్ణయం మేరకు నిత్యం ఉదయం 4 గంటలకు ప్రధాన దేవస్థానం ద్వారం తలుపులు తెరిచి నిత్య సేవలు ఆరంభిస్తారని తెలిపారు.
కార్తీకంతో వరుస దర్శనం వాయిదా
పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీ మందిరం భక్తుల తాకడితో కిటకిటలాడుతుంది. ప్రత్యేక సేవాదులు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా శ్రీ మందిరంలో మూల విరాటుల వరుస దర్శనం వ్యవస్థని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు శ్రీ మందిరం సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఆలయం లోపల మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు యోచిస్తున్నారు. ఆలయ సంప్రదాయాలు ప్రభావితం కాకుండా ఈ వర్గం భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. దీని కోసం ప్రత్యేక ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాలు (ఎస్‌ఓపీ) రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధానంగా జగన్నాథ ఆలయ పోలీసులపై (జేటీపీ) ఫోన్ల వాడకంపై ఆంక్షలు ఖరారు చేసిన తర్వాత ఆలయ సేవకులు మొబైలు ఫోనుల వినియోగంపై ఆంక్షలు జారీ చేస్తారు. ప్రతి బుధవారం ఒక సమన్వయ కమిటీ సమావేశమై శ్రీ మందిరం నిత్య దైనందిన కార్యకలాపాల్లో వివిధ వర్గాల పని తీరులో క్రమశిక్షణని సమీక్షిస్తారని సీఏఓ తెలిపారు.

శ్రీమందిరంలో కార్తీక సేవలు ప్రారంభం