
జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు
● ఆచూకీ తెలిపిన వారికి రూ. 50,000 నగదు పురస్కారం
● ఉన్నత స్థాయి దర్యాప్తు
భువనేశ్వర్: కటక్ జిల్లా చౌద్వార్ సర్కిల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నారు. ఇది రాష్ట్రంలో అతి పెద్ద కారాగారం. కరడు దేరిన నేరస్తులను ఖైదీలుగా నిర్బంధిస్తారు. గురువారం రాత్రి జైలు గోడ దూకి ఖైదీలు ఉడాయించారు. రాష్ట్రంలో జైలు భద్రత ప్రశ్నార్థకమైంది. పారిపోయిన ఇద్దరు ఖైదీలు బీహార్ ప్రాంతీయులు. వారిలో మధుకాంత్ కుమార్, రాజా సహాణి బిహారీ బందిపోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరివురు పాణికొయిలిలో ఆభరణాల దుకాణం దోపిడీలో నిందితులు. దోపిడి సందర్భంగా వారు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తిని కూడా చంపారు. ఈ నేపథ్యంలో వీరివురి వ్యతిరేకంగా దోపిడీ, హత్య ఆరోపణలపై కేసులు నమోదు చేసి ఈ జైలులో పెట్టారు. ఖైదీలను అరెస్టు చేయడానికి కటక్ జోన్–1 ఏసీపీ, చౌద్వార్ పోలీస్ ఠాణా అధికారి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఉన్నత స్థాయి దర్యాప్తు
కటక్ రేంజ్ డీఐజీ ఆదేశాలు మేరకు ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. జైలు డీఐజీ ప్రత్యక్షంగా ఘటనా స్థలం సందర్శించారు. ఆమెతో చౌద్వార్ ఠాణా ఇనస్పెక్టర్ ఇన్‌చార్జి ఉన్నారు. సైంటిఫిక్ బృందం మరియు స్నిఫర్ డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలం చేరుకుని పరిశీలన చేస్తుంది. చౌద్వార్ ఠాణా పోలీసులు దర్యాప్తు కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వార్డర్లు సస్పెండ్
ఖైదీలు పరారీ సంఘటన పురస్కరించుకుని ఇద్దరు వార్డర్లను సస్పెండ్ చేశారు. వీరిలో ఒకరు చీఫ్ వార్డెన్. పారిపోయిన ఖైదీలు కంబళ్లు చించి తాళ్లుగా పేముకుని గోడ దూకి పారిపోయినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించినట్లు జైలు డీజీ సుశాంత్ నాథ్ తెలిపారు.
ఆచూకీ తెలిపితే రూ. 50,000
చౌద్వార్ జైలు నుండి తప్పించుకున్న ఖైదీల గురించి విశ్వసనీయ సమాచారం ఇచ్చిన వారికి రూ. 50,000 నగదు పురస్కారం ప్రకటించారు. చౌద్వార్ సర్కిల్ జైలు నుంచి తప్పించుకున్న విచారణ అధీన ఇద్దరు ఖైదీలను గుర్తించడంలో మరియు పట్టుకోవడంలో సహాయం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజా సహాణి బీహారు రాష్ట్రం బెగుసరాయ్ జిల్లా ముఫ్‌సిల్ ఠాణా లోహియా గ్రామస్తుడు కాగా మధుకాంత కుమార్ బీహారు రాష్ట్రం సొరొణొ జిల్లా గౌర్ ఠాణా రామ్‌పూర్ గ్రామస్తుడుగా వివరాలు జారీ చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. సమాచారం తెలిస్తే సహాయక పోలీసు కమిషనరు 9437148161, చౌద్వార్ ఠాణా ఇన్‌స్పెక్టర్‌కు 9338025119కు సమాచారం అందించాలన్నారు.

జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు