
కొండచిలువ హల్ చల్
రాయగడ: సదరు సమితి మల్లిగాంలోని ఓ హోటల్ ముందు కొండచిలువ హల్‌చల్ చేసింది. వర్షాల కారణంగా హోటల్‌ను మూసివేశారు. సమీపంలోని తుప్పల్లో నుంచి వచ్చిన కొండచిలువ హోటల్‌లోని బెంచికింద ఉండిపోయింది. గురువారం తెరిచేందుకు వెళ్లిన యజమానికి బెంచి కింద పాము కనిపించడంతో భయంతో పరుగులు తీశాడు. వెంటనే స్నేక్ క్యాచర్ ప్రదీప్ కుమార్ సేనాపతికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఆయన పామును పట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.
లక్ష్మి ఇక లేదు
భువనేశ్వర్: పూరీ స్వర్గ్ ద్వారం శ్మశాన వాటికలో అంత్యక్రియల దశలో మేలుకొని కళ్లు తెరిచిన 86 ఏళ్ల పి.లక్ష్మి శాశ్వతంగా కళ్ళు మూశారు. గత నెల 15న ఈ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. అది మొదలుకొని ఆమె పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల ఒకటో తేదీ బుధవారం రాత్రి ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇద్దరికి ఎక్స్‌గ్రేషియా ప్రకటన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రెండురోజులుగా కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన ఆర్.ఉదయగిరి సమితి బస్త్రిగుడ గ్రామానికి చెందిన త్రినాథ నాయక్, మోహనా సమితి మెరాపల్లి గ్రామ పంచాయతీ వాసి లక్ష్మణ్ నాయక్‌ల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం కింద రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ మధుమిత తెలియజేశారు.
మోటు నుంచి
కాంగ్రెస్ నేతల పాదయాత్ర
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు ముగీ పాయింట్ నుంచి గురువారం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ పాదయాత్ర ప్రారంభించారు. గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. ముందుగా మోటు ముగీ పాయింట్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రజలతో పలు అంశాలపై చర్చించారు. పాదయాత్ర మోటు నుంచి మల్కన్‌గిరి వరకు సాగింది. కార్యక్రమంలో రాష్ట్ర యువ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కృష్ణచంద్ర మహంతి, మల్కన్‌గిరి కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు, మాజి అధ్యక్షుడు గోవింద పాత్రో, చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో తదితరులు పాల్గొన్నారు.

కొండచిలువ హల్ చల్