
నదిలో దూకాడు.. రక్షించాక పరారయ్యాడు..
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని కంపోస్టు కాలనీ నీళ్ల ట్యాంకు సమీప నాగావళి నదిలో ఓ యువకుడు దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీరా అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి రక్షించాక అక్కడి నుంచి కుటుంబీకులతో పరారయ్యాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు, ఒకటో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...
గార మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన బాకి రమణకు ఇద్దరు కుమారులు గణేష్, రాజు(24). గణేష్ హైదరాబాద్‌లోని కంపెనీలో పనిచేస్తుండగా.. రాజు బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో గొడవ జరిగిందని, సూసైడ్ నోట్ రాసి బయటకు వచ్చేసినట్లు అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. అక్కడి నుంచి నగరంలోని దమ్మలవీధి సమీపంలో కొంతమందితో కలసి యువకుడు సాయంత్రం వరకు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. రాత్రి అయ్యాక రాజు తన సోదరుడైన గణేష్‌కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడంతో వెంటనే ఫైర్‌సర్వీస్‌కు, ఒకటో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోగా నదిలో యువకుడు దూకేశాడు.
ఘటనా స్థలికి డీఎస్పీ..
వరదముంపుల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్న ఎస్పీ ఆదేశాలతో అప్పటికప్పుడే డీఎస్పీ వివేకానంద సైతం ఘటనా స్థలికి వెళ్లారు. అప్పటికే ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు రెస్క్యూ సిబ్బందిని నదిలో బోట్‌లో పంపించారు. నదిలో ఓ మూ లన ఉన్న చెట్టుకొమ్మకు వేలాడి ఉన్న యువకుని వద్దకు చేరుకున్న సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు తెచ్చారు. చీకటిమయం కావడంతో అప్పటికే అక్క డికి చేరుకున్న రాజు కుటుంబీకులు ముగ్గురు తుప్ప ల మధ్య నుంచి తీసుకెళ్లి బండిపై వెళ్లిపోయారు. దీనిపై రూరల్‌సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ యువకుడు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.