
నేడు జగన్నాథుడి స్వర్ణాలంకార దర్శనం
భువనేశ్వర్ : పూరీలో జగన్నాథుడు విజయదశమి సందర్భంగా గురువారం స్వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి కొలువు దీరిన శ్రీ మందిరం రత్న వేదికపై ప్రత్యేక సందర్భాల్లో దేవతా త్రయం బంగారు అలంకరణలో దర్శనం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో అశ్విని శుక్ల పక్ష దశమి తిథి దసరా సందర్భంగా జగన్నాథుడు బంగారు శోభతో రాజ రాజేశ్వర అలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. నిత్య దైనందిన ప్రాథమిక ఉపచారాలు ముగిసిన తర్వాత జగన్నాథుడు, సోదరి దేవీ సుభద్రని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.
వ్యక్తిపై దాడి
సారవకోట : కిడిమి పంచాయతీ బుడ్డయ్యపేటకు చెందిన పిల్లా పున్నయ్యపై జమచక్రం గ్రామానికి చెందిన మెండ ఆదినారాయణ దాడికి పాల్పడ్డాడు. మంగళవారం మేకల మేత విషయంలో జరిగిన తగాదాలో ఆదినారాయణ తనపై దాడి చేసి గాయపర్చినట్లు పున్నయ్య బుధవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏఎస్‌ఐ కృష్ణారావు కేసు నమోదు చేశారు. బాధితుడు ప్రస్తుతం జిల్లా సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఎచ్చెర్ల : ఉన్నత విద్యా మండలి సూచనల మేరకు 2025 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు ఈ నెల 3, 4 తేదీల్లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ బి.అడ్డయ్య బుధవారం తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు హాజరుకావాలని కోరారు.
జీఎస్టీ తగ్గింపుపై అవగాహన
శ్రీకాకుళం పాతబస్టాండ్: జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీఎస్టీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రెండు రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్య పన్నులు, విద్యుత్, చేనేత శాఖల అధికారులు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జీఎస్టీ నోడల్ అధికారి స్వప్నదేవి తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ పోటీలకు వర్శిటీ విద్యార్థులు
ఎచ్చెర్ల : కర్ణాటకలోని బెల్గామి వద్ద రాణీ చిన్నమ్మ వర్శిటీలో ఈ నెల 4 నుంచి 7 వరకు జరగనున్న సౌత్ జోన్ అంతర్ వర్శిటీ పురుషుల కబడ్డీ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు స్థానిక బీఆర్‌ఏయూ జట్టు బుధవారం పయమయ్యింది. జట్టుకు కోచ్‌గా ఎం.గణేష్ వ్యవహరించనున్నారు. పోటీల్లో రాణించి విజయం సాధించాలని వ్యాయామ విభాగ అధ్యాపకులు శ్రీనివాసరావు, భాస్కరరావు ఆకాంక్షించారు.
మెట్ల పైనుంచి జారిపడి వ్యక్తి మృతి
జలుమూరు: తలతరియా పంచాయతీకి చెందిన దండుపాటి గడ్డయ్య(55) ఇంటి మెట్ల పైనుంచి జారిపడి బుధవారం మృతి చెందాడు. గడ్డయ్య గత నెల 16న ఇంటి నుంచి డాబాపైకి మెట్లు ఎక్కుతూ జారిపడ్డాడు. తల,శరీర భాగాలకు గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు మృతుడి సోదరుడు అప్పయ్య తెలిపారు. గడ్డయ్యకు భార్య యశోద, కుమారుడు రామన్న ఉన్నారు. అప్పయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు.
జీసీడీఓగా మాధవి
శ్రీకాకుళం : జిల్లా సమగ్ర శిక్షలో సెక్టోరియల్ పోస్టుల్లో ఒకటైన జీసీడీఓగా చదువుల మాధవి నియమితులయ్యారు. మంగళవారం ఉత్తర్వులు వెలువడగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈమె సారవకోట మండలం పిడిమి ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఈమె భర్త జల్లేపల్లి శ్రీనివాసరావు గతంలో సమగ్ర శిక్షలో ఏఎస్‌ఓగా పనిచేశారు. జీసీడీఓ పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. కాగా, కొద్దిరోజుల కిందట అసిస్టెంట్ జీసీడీఓగా కాకినాడకు చెందిన రమాదేవిని నియమించారు. జిల్లాల పునర్విభజనలో ఈ పోస్టు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయింది. లేనిపోస్టులో రమాదేవిని నియమించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా జీసీడీఓ నియామకం పూర్తయిన నేపథ్యంలో అసిస్టెంట్ జీసీడీఓని కొనసాగిస్తారా ఆమెను వెనక్కు పంపిస్తారా అనేది వేచి చూడాల్సిందే.