
శ్రీ మందిరం పరిసరాల్లో మద్యం దుకాణాలు నిషేధం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీ మందిరం పరిసరాల్లో బొడొదండొ వెంబడి 1 కిలో మీటరు పరిధిలో మద్యం దుకాణాలు, అబ్కారీ సంబంధిత వస్తువుల అమ్మకాలు ఉండవు. అంతే కాకుండా ఈ పరిధిలో మాంసాహార వస్తువుల అమ్మకాలు పరిమితం చేస్తారు. ఆలయం చుట్టూ ఆధ్యాత్మిక పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు.
కొండచిలువ హల్‌చల్
రాయగడ: స్థానిక గంగాగ్యారేజీ సమీపంలో సోమవారం రాత్రి భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. గ్యారేజీ సమీపంలో ఆగిఉన్న ఒక లారీలో కొండచిలువ ఉండటం గమనించిన అక్కడి వారు వెంటనే స్నేక్ క్యాచర్ ప్రదీప్ సేనాపతికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సేనాపతి సుమారు గంట సమయం కష్టపడి కొండచిలువను పట్టుకున్నారు. ఆరు అడుగుల పొడవుగల దీనిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దసరా కావడంతో లారీని సంబంధిత యజమాని పరిశుభ్రం చేస్తున్న సమయంలో ఛాసీస్ వద్ద దాగిఉన్న కొండచిలువ తారసపడింది.
సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి
రాయగడ: దసరా సమయంలో ప్రయాణికులతో రైళ్లు రద్దీగా ఉంటాయి. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు భద్రతతో పాటు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలంటే అందుకు ఎంతో అప్రమత్తత అవసరమని ఆర్‌పీఎఫ్ అధికారి టి.ఎస్.భంజ్ అన్నారు. జిల్లాలోని మునిగుడ రైల్వే స్టేషన్లో ఈ మేరకు ప్రయాణికులకు అవగాహన, చైతన్య కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రైళ్లు ఎక్కేదిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వివిధ జాగ్రత్తలకు సంబంధించి అవగాహన కల్పించారు. అలాగే రైళ్లలో పరిశుభ్రతను పాటించడం ఆరోగ్యానికి ఎంతోమేలని అందుకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇద్దరి అరెస్టు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో గౌడిగూడకు చెందిన విబుషన్ దొర, నరసింహ దొర ఇద్దరిపై మత్తిలి పోలీస్‌స్టేషన్‌లో 2018లో కేసు నమోదైంది. ఆ సమయంలో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్లకు బెయిల్‌పై విడుదలయ్యారు. కోర్టుకు హాజరు కావాల్సిన సమయాల్లో వారు హాజరు కాలేదు. మూడు సార్లు నోటీసులు వచ్చినా హాజరు కాలేదు. దీంతో వారికి అరెస్టు వారెంట్ జారీ చేశారు. మంగళవారం పోలీసులు వారిని అరెస్టు చేశారు.
పాముకాటుతో విద్యార్థి మృతి
జయపురం: పాముకాటుతో ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో చోటుచేసుకుంది. బొయిపరిగుడ సమితి గుప్తేశక్వర గ్రామ పంచాయతీ గోయల్‌కుండ గ్రామానికి చెందిన చంద్రసేన్ దురువ (13) తన కుటుంబ సభ్యులతో సోమవారం సాయంత్రం తమపొలంో మొక్కజొన్న కండెలు తెంచేందుకు వెళ్లారు. చంద్రసేన్ జొన్నపొత్తులు తెంచుతున్న సమయంలో విషసర్పంచ్ చేయివేలుపై కాటువేసింది. దీంతో చంద్రసేన్ పరుగున వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పగా.. వారు వెంటన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి గుణియ వద్దకు తీసుకెళ్లారు. గుణియ చికిత్స చేస్తుండగా అతడు మరణించాడు. సమాచారం అందిన రామగిరి పోలీసు పంటి ఏఎస్‌ఐ విష్ణు మడకామి గోయల్‌కుండ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూఢనమ్మకాల వల్లే చంద్రసేన్ మరణించాడని స్థానికులు చెబుతున్నారు.

శ్రీ మందిరం పరిసరాల్లో మద్యం దుకాణాలు నిషేధం