
మధ్యవర్తిత్వమే మేలు
భువనేశ్వర్: వివాదాస్పద పరిస్థితుల్లో న్యాయమైన, స్నేహపూర్వక, శాశ్వత పరిష్కారాలకు మధ్యవర్తిత్వమే అత్యున్నత మార్గమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ద్వితీయ జాతీయ మధ్యవర్తిత్వ సమావేశం – 2025 నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పరిమిత వ్యక్తులు, వర్గాల మధ్య పరిమితం కావలసిన వివాదాలు కోర్టు వరకు పోకుండా గుట్టుగా పరిష్కరించుకుని సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడానికి మధ్యవర్తిత్వం ముఖ్యమైన సాధనమని పేర్కొన్నారు. కోర్టుల్లో వివాదాలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా సంబంధాలను మెరుగుపరిచి పునరుద్ధరించే చక్కని సంస్కరణ ప్రక్రియగా అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా పలు న్యాయ స్థానాల్లో 4 కోట్లకు పైగా కేసులు మగ్గుతున్నాయని, సామాజిక ఐక్యతను ప్రోత్సహించడంతో పాటు న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడానికి మధ్యవర్తిత్వం అనివార్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వ చట్టం – 2023 చట్టబద్ధమైన అమలుతో ఆచరణకు నోచుకోవడం భారత న్యాయవ్యవస్థలో మైలురాయి దశగా నిలిచిపోయిందన్నారు. బలహీన వర్గాలకు, సమ్మిళితత్వం, న్యాయబద్ధత, ప్రజా విశ్వాసాన్ని నిర్ధారించడంలో ఈ ఆచరణ ప్రయోజనాత్మక చర్యగా కొనసాగాలని పిలుపునిచ్చారు.
● భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అత్యంత వేగవంతమైన వివాద పరిష్కార వేదికగా, ఊపందుకుంటున్న వ్యవస్థగా పేర్కొన్నారు. వాదోపవాదాలతో కూడిన ఇరుపక్షాల మధ్య గెలుపు, ఓటమి అతీతంగా సంభాషణ, అవగాహన, పరస్పర సహకారంతో వివాద పరిష్కారాలకు పూర్తి అవకాశం కల్పిస్తుందన్నారు. ఇందుకు పలు అనుభవపూర్వక చారిత్రాత్మక సంఘటనలు అద్దం పడుతున్నాయని చెప్పారు.
● భారతదేశ రాజకీయ, సామాజిక అనుభవాలకు మధ్యవర్తిత్వం కొత్తేమీ కాదన్నారు. మధ్యవర్తిత్వ చట్టం, 2023 కింద అధికారిక క్రోడీకరణకు ముందే మన ప్రక్రియలలో అంతర్భాగంగా కీలక పాత్ర పోషించిందన్నారు.
● ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి మాట్లాడుతూ పలు న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న కోట్లాది కేసుల విచారణతో న్యాయమూర్తులు, న్యాయవాదులు సతమతమై అపారమైన ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితుల్లో మధ్యవర్తిత్వం చక్కని పరిష్కారం అందిస్తుందన్నారు. ఈ చర్యతో కోర్టులపైనా ఒత్తిడి తగ్గి ప్రజలు త్వరగా, సులభంగా న్యాయం పొందుతారని చెప్పారు. మధ్యవర్తిత్వం సంబంధాల పునరుద్ధరణతో కుటుంబాలు, వ్యాపారాలు, సామాజిక వర్గాల్లో సామరస్యాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తుందన్నారు.
● ఒరిస్సా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి హరీష్ టాండన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ప్రోత్సహించి సమాజంలో ఉనికిని నిర్ధారించుకుని వేగవంతమైన వివాద పరిష్కార మాధ్యమంగా కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుందన్నారు.
● సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం శాశ్వత పరిష్కారాలను పెంపొందిస్తుందన్నారు. భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ అన్ని జాతీయ న్యాయ పాఠశాలల్లో మధ్యవర్తిత్వంపై పూర్తి స్థాయి కోర్సులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య, ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానస్ రంజన్ పాఠక్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానిక
చక్కటి వేదిక
జాతీయ మధ్యవర్తిత్వ
సమావేశంలో గవర్నర్
డాక్టర్ కంభంపాటి హరిబాబు

మధ్యవర్తిత్వమే మేలు

మధ్యవర్తిత్వమే మేలు

మధ్యవర్తిత్వమే మేలు