
హాస్టల్ విద్యార్థి మృతి
● ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలు
కొరాపుట్: హాస్టల్ విద్యార్థి మృతితో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సబ్ డివిజన్ రాయిఘర్ సమితి తురిడి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న మంగళ సింగ్ గొండో (12) మృతి చెందాడు. కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైనా వార్డెన్ పట్టించుకోకపోవడంతో అచేతన స్థితికి వెళ్లిపోయాడు. తర్వాత కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా ఆర్‌ఎంపీ వైద్యునికి చూపించడంతో అప్పటికే పరిస్థితి విషమించింది. వెంటనే హఠబరండి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉమ్మర్‌కోట్ డివిజన్ ఆస్పత్రికి తరలించేటప్పటికే విద్యార్థి మృతిచెందాడు. విద్యార్థి అనారోగ్య విషయం తల్లిదండ్రులకు తెలియజేయకపోవడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం రాష్ట్ర ప్రాథమిక విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో సొంత నియోజకవర్గ పరిధిలోనిది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా వెళ్లి సమితి విద్యాధికారి కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళనకు దిగారు. ఘటన జరిగిన హాస్టల్‌లో రాత్రి పూట ప్యూన్ తప్ప ఎవరూ ఉండరని విద్యార్థులు పేర్కొనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుబాష్ గొండొ తదితరులు ఆందోళనకు దిగారు. చివరకు ఉన్నతాధికారులు స్పందించి ఘటనపై దర్యాప్తు చేయించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

హాస్టల్ విద్యార్థి మృతి