
మందుగుండు సామగ్రి స్వాధీనం
కొరాపుట్: అక్రమంగా నిల్వ చేసిన మందుగుండు సామగ్రిని నబరంగ్‌పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్‌ఐ గణేష్ పట్నాయక్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించగా నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు చెప్పారు. బి.సూరజ్, వి.ఉమాశంకరరావు, కె.శ్రీధర్‌లపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మందుగుండు సామగ్రిని సీజ్ చేశామన్నారు.
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
కొరాపుట్ : కేవుటి వీధిలో జరుగుతున్న పేకాట శిబిరంపై నబరంగ్‌పూర్ పోలీసులు దాడి చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి రూ.35,260 నగదు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్సాహంగా క్విజ్ పోటీలు
రాయగడ : ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాయగడ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం క్విజ్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యం కల్పిస్తోందని చెప్పారు. చదువుతో పాటు సామాజియ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సుస్మిత బౌరి, జిల్లా పర్యాటక శాఖ అధికారి మనోజ్‌కుమార్ నాహక్ పాల్గొన్నారు.
మహిళపై దాడి
రాయగడ: గుర్తు తెలియని ఇద్దరు దుండగులు మహిళపై దాడి చేసి మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెతాడును తెంపుకొని వెళ్లిపోయిన ఘటన శనివారం స్థానిక మజ్జివీధి కూడలిలొ చోటు చేసుకుంది. కేసీసీబీ రోడ్డు సమీపంలో నివసిస్తున్న నారంశెట్టి జగదాంబ ఉదయం మజ్జివీధి సమీపంలోని కిరాణా దుకాణానికి పాలు ప్యాకెట్ కొనేందుకు వెళ్లింది. అదే సమయంలో ఇద్దరు దుండగులు ముందుగా మజ్జివీధి కూడలిలో కాపుకాసి ఆమెను అనుసరించి వెనుక నుంచి కర్రతో ఆమె తలపై గాయపరిచి కిందపడిన తరువాత మెడలోని పుస్తెల తాడును తెంపుకువెళ్లిపొయారు. గాయాలతో పడిపోయి ఉన్న ఆమెను చూసిన స్థానికులు కుటుంబీకులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం సదరు పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. పట్టపగలే ఇటువంటి దొంగతనాలు చోటు చేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓటీఈటీకి 2,259 మంది హాజరు
రాయగడ: రాష్ట్ర మాధ్యమిక విద్యా పరిషత్ శనివారం నిర్వహించిన ఒడిశా టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఓటీఈటీ)కు రాయగడ జిల్లా నుంచి 2259 మంది అభ్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లాలో 2365 మంది దరఖాస్తు చేశారు. పరీక్షకు 106 మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరైన వారిలో పేపర్–1కి 41 మంది, పేపర్–2కు 65 మంది ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలకు నిర్వహించిన మొదటి పరీక్షలు ఉదయం 9 నుండి 11.30 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ఏడాది జూలై 20న జరిగిన ఈ పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజ్ కావడంతో రద్దు చేసిన విషయం తెలిసిందే.

మందుగుండు సామగ్రి స్వాధీనం

మందుగుండు సామగ్రి స్వాధీనం