
పాలన భేష్
రాష్ట్ర నాయకత్వంపై ప్రధాని మోదీ భరోసా
గవర్నర్, సీఎంలకు అభినందనలు
భువనేశ్వర్: ఒక రోజు రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని శనివారం ఝార్సుగుడలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం పట్ల గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. తొలుత రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రధానికి స్వాగతం పలికారు. వీరివురి పట్ల ప్రధాని ఆత్మీయతను ప్రదర్శించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర గవర్నర్ పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. ప్రజల వద్దకు ప్రభుత్వ పాలన చేరదీయడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఇదే ప్రేరణతో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రజాభిమాన నేతగా మన్ననలు పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రభుత్వం సరికొత్త చరిత్రని ఆవిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అన్నింటా ప్రగతిపథంలో దూసుకుపోతోందన్నారు. మోహన్ చరణ్ మాఝీ ప్రజాభిమాన (లోకప్రియ), నిబద్ధతతో కష్టపడి పనిచేసే (కర్మథ) ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్నారని ప్రశంసల జల్లు కురిపించారు.
విపక్షంపై నో కామెంట్..
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షం బిజూ జనతా దళ్ నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తూ కించపరుస్తుండగా ఝార్సుగుడ బహిరంగ సభా కార్యక్రమంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ పట్ల స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శస్త్రచికిత్స సందర్భంగా ఆప్యాయంగా పరామర్శించి బాగోగుల్ని పర్యవేక్షించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పాలన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య బేదాభిప్రాయాలు భగ్గుమంటున్న తరుణంలో ప్రధాన మంత్రి బిజూ జనతా దళ్ పట్ల ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా హుందాతనం చాటుకున్నారు. మరో వైపు ప్రధాన మంత్రి ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో దోపిడీ తంత్రంతో దేశాన్ని నిలువునా కొల్లగొట్టిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

పాలన భేష్