
దసరా సెలవులకు ఇంటికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలొ విద్యార్థి దుర్మరణం ● స్వల్ప గాయాలతో బయటపడిన సోదరుడు
రాయగడ : పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో ఆనందంగా ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సదరు సమితి చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకురుగుడ కూడలిలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాసీపూర్ సమితి సింధూరఘాటి పంచాయతీ డెరకొన గ్రామానికి చెందిన రాహుల్ నాయక్ (14) పెనికొన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ప్రకటించడంతో సోదరుడు లోచన్ నాయక్‌తో కలిసి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. బాకురుగుడ వద్ద ఎదురుగా వస్తున్న లారీని అదుపుతప్పి ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న రాహుల్ కిందపడ్డాడు. ఈ ఘటనలో లారీ వెనుక చక్రం కిందపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. లోచన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

దసరా సెలవులకు ఇంటికి వెళ్తూ..