
డీసీసీ అధ్యక్షుడిగా అప్పలస్వామి కడ్రక
రాయగడ: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా రాయగడ శాసనసభ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక నియమితులయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సాధారణ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కడ్రకను ఆయన అభిమానులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
అడాబడిలో దొంగల హల్‌చల్
రాయగడ: ఓ వృద్ధురాలి చెవిదిద్దులను గుర్తు తెలియని వ్యక్తులు తెంచుకువెళ్లిన ఘటన కళ్యాణసింగుపూర్ సమితి అడాబడి గ్రామంలో చోటు చేసుకుంది. ధమునిపొంగ పంచాయతీ గుండిరిగుడ గ్రామానికి చెందిన సపాయి హికక (73) అనే వృద్ధురాలు స్టేట్‌బ్యాంక్‌కు వ్యక్తిగత లావాదేవీల కోసం గురువారం వచ్చింది. బ్యాంకు పనులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒడాబడి కూడలిలో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు అడ్డగించి చెవిలో దిద్దులను దొంగిలించుకుని వెళ్లిపోయారు. చెవి తెగి రక్తం కారుతుండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో బాధితురాఉల ఫిర్యాదు చేసింది.
మనస్థాపంతో ఆత్మహత్య
బూర్జ: మండలంలోని ఉప్పినివలస గ్రామానికి చెందిన బొమ్మాళి శిరీష (22) గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శిరీషకు తల్లిదండ్రులు వివాహ సంబంధాలు చూస్తుండగా ఆమె తిరస్కరిస్తూ ఉండేది. వివాహం చేసుకోనని.. తన చిన్నాన్న దగ్గర చదువుకుంటానని చెప్పేది. ఈ క్రమంలో బుధవారం భోజనాల తర్వాత పక్క ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా, ఆమె తల్లి తనకు సాయం చేయకుండా పక్క ఇంటికి ఎందుకు వెళ్లావని మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్నటువంటి గడ్డిమందు తాగేసింది. తల్లి గన్నెమ్మ చూసి వెంటనే 108 సాయంతో శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి తండ్రి రాజు, తల్లి గన్నెమ్మ, అక్క దివ్య, డిగ్రీ చదువుతున్న తమ్ముడు మని ఉన్నారు. తల్లి గన్నెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.ప్రవళ్లిక తెలియజేశారు.

డీసీసీ అధ్యక్షుడిగా అప్పలస్వామి కడ్రక