
భార్యను హత్య చేసిన భర్త
రాయగడ: భార్య, భర్తలు ఇద్దరూ పూటుగా మద్యం సేవించిన అనంతరం మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో కొపొద్రేక్తుడైన భర్త భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలోని రఘుబారి పంచాయతీలోని మతాబారు గ్రామంలో ఈ ఘోరం ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఎస్‌డీపీవో సంతొషిణి ఓరం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మతాబారు గ్రామంలో నివసిస్తున్న తుతు మాఝి, చిత్ర మాఝిలు భార్యా భర్తలు. కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో భార్య చిత్ర భర్తను చెంపపై కొట్టింది. కొపొద్రేక్తుడైన భర్త తుతు ఇంట్లోని గొడ్డలిని తీసుకువచ్చి భార్యను దారుణంగా నరికి చంపి అక్కడి నుండి పరారయ్యాడు. దర్యాప్తు చేసిన పోలీసులు సొమవారం తుతుని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అంబొదల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
గంజాయి కేసులో
మరో నలుగురు అరెస్టు
జయపురం: సంత తోటలో గత నెల 29న దొరికిన గంజాయి కేసులో మరో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగన్నాథ్ కాశ్యప్ సోమవారం వెల్లడించారు. జయపురం పట్టణ పోలీసు స్టేషన్ సభాగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమర కుమార్ బహుదూర్ ఉరఫ్ శంకర లంబ(37), చింటు ముదులి(29), సంజయ కోశ్ల (29), కేశవ హరిజన్(30)ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు
51 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి 51 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో అదనపు ఎస్పీ (అడ్మిన్) కేవీ రమణ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌కాల్స్ ద్వారా తక్షణమే తెలియపరచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలన్నారు.

భార్యను హత్య చేసిన భర్త