స్వచ్ఛతలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుదాం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ అవార్డు పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్ అని, సమష్టి కృషితో స్వచ్ఛతలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుదామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ త్వరలో పట్టణాలు, గ్రామాల్లో స్వచ్ఛ సేవక్ దళాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాలకు త్వరలో 12 వేల ట్రైసైకిళ్లు అందిస్తామని, 1,600 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.
స్వర్ణాంధ్ర సాకారానికి స్వచ్ఛాంధ్ర కీలకం
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు తమ శాఖ కీలక భాగస్వామ్యం అందిస్తుందని చెప్పారు.
స్వచ్ఛాంధ్ర పురస్కారాలతో ఆరోగ్యకర పోటీ
విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎం మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొల్పేందుకు స్వచ్ఛాంధ్ర పురస్కారాలు దోహదం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీపీఓ పి.లావణ్య కుమారి, ఆర్డీఓలు కావూరి చైతన్య (విజయవాడ), కె.బాలకృష్ణ (నందిగామ), కె.మాధురి (తిరువూరు), గ్రీన్ అంబాసిడర్స్ బి.భూషణం, బి.సామ్రాజ్యం, శంకర్, పురస్కార గ్రహీతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్
పట్టాభిరామ్


