ధాన్యం సేకరణపై ప్రణాళిక రూపొందించాలి
పెనమలూరు: ఖరీఫ్ ధాన్యం దిగుబడులపై ప్రణాళిక సిద్ధం చేసి సకాలంలో రైతుల వద్ద ధాన్యం సేకరించి మిల్లులకు పంపాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం ఏపీ పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఉయ్యూరు డివిజన్ స్థాయిలో రెవెన్యూ, ఏవోలు, రైతుసేవా కేంద్రాల సిబ్బందికి అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ ఖరీఫ్ వరి సాగు దిగుబడులు త్వరలో ప్రారంభం అవుతాయని, వరి దిగుబడుల పై అధికారులు పూర్తి అవగాహనతో ఉండి అంచనా వేయాలని సూచించారు. ఈ–క్రాప్ చేయటం వలన ఎంత దిగుబడి వస్తుందో ముందుగా అంచనా రూపొందించాలని సూచించారు. రైతులకు ఈకేవైసీ చేయటం వలన రైతుల, పంట సాగు వివరాలు ఉంటాయని, ఏఏ ప్రాంతంలో పంట దిగుబడి ముందుగా వస్తుందో గుర్తించి, రైతులకు రవాణా, గన్నీ బ్యాగ్‌లు అందజేయాలని సూచించారు. వరి పంట తేమ 17 శాతం ఉండే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తేమ శాతం సక్రమంగా ఉంటే గిట్టుబాటు ధర రైతులకు అందుతుందని తెలిపారు. మిల్లులకు సకాలంలో ధాన్యం తరలించాలన్నారు.
గిట్టుబాటు ధర ఇవ్వాలి
ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని జాయింగ్ కలెక్టర్ నవీన్ అన్నారు. సాధారణ రకం 75 కేజీల బస్తా(కామన్) రూ.1777, ఎ గ్రేడ్ రకం 75 కేజీల బస్తా రూ.1792 ధర ఇవ్వాలన్నారు. రైతుల అవసరాలకు టోల్ ఫ్రీ నంబర్ 8247693551 అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీవో హేలాషారోన్, సివిల్ సప్లయిస్ డీఎం టి.శివరామ్‌ప్రసాద్, డీఎస్‌వో మోహన్‌బాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, డివిజన్ పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
రైతులకు మద్దతు ధర ఇవ్వాలి
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్


