విజయవాడరూరల్: గ్రామాల్లో పచ్చమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. దసరా పండుగ వేళ అంబాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ముగ్గురు కలిసి ఒక వ్యక్తిపై మద్యం మత్తులో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మేరుగ కిరణ్ అనే వ్యక్తి దవడ రెండు చోట్ల విరిగిపోయింది. ఈ సంఘటన గురువారం అంబాపురం గ్రామం తోటమూల సెంటర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వడ్డేశ్వరపు ఆనంద్ పై టూటౌన్ పోలీసు స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉంది. అతని అనుచరులు చోడవరపు ప్రవీణ్‌కుమార్, దొప్పలపూడి సుధీర్‌లతో కలసి ఆనంద్ తోటమూల సెంటర్‌లో తన స్నేహితులతో వెళుతున్న మేరుగ కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. కిరణ్‌తో పాటు ఉన్న అతని స్నేహితులు పరారు కాగా, ఆనంద్ అతని స్నేహితులు కలిసి కిరణ్‌పై దాడి చేశారు. దేహమంతా అనేక గాయాలు అవడంతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతనిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి దవడ ఎముక రెండు చోట్ల విరిగిపోయిందని, సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. బాధితుడు మేరుగ కిరణ్ ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకుల అండదండలతో వడ్డేశ్వరపు ఆనంద్ తన అనుచరులను వెంటపెట్టుకుని మద్యం తాగుతూ గ్రామంలో దాడులకు తెగబడుతుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటువంటి అల్లరి మూకలను గ్రామ బహిష్కరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.