
కాలువలో పడి ఒకరి మృతి
కమ్మర్‌పల్లి: మండల కేంద్రం నుంచి నాగాపూర్ వెళ్లే రోడ్డులోని వరద కాలువలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి పడి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానిక ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన కొమిరే రాజేందర్(47) ఆదివారం సాయంత్రం నాగాపూర్ రోడ్డులోని వరద కాలువలో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు పడి నీట మునిగాడు. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా లభించలేదు. మంగళవారం ఉదయం కాలువలో వ్యక్తి మృతదేహం తేలియాడటంతో గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్సపొందుతూ ఒకరు..
మాక్లూర్: రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఒడ్డెట్‌పల్లి గ్రామానికి చెందిన పుల్లింటి సాయిలు(54) సోమవారం తన మేకలను గ్రామ శివారులో మేపుతుండగా మధ్యాహ్నం సమయంలో ఓ మేక రైలు పట్టాలపైకి వెళ్లింది. ఆ సమయంలోనే రైలు వస్తుండటంతో సాయిలు గమనించి మేకను పట్టాల పైనుంచి తరమివేసే ప్రయత్నంలో అతడిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. గమనించిన సమీప రైతులు వెంటనే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య సావిత్రి, కుమారుడు ఉన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి ఇసుక లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్‌ను సోమవారం రాత్రి పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. బాన్సువాడ మండలం బుడ్మి గ్రామం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తీసుకురావడంతో ట్రాక్టర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

కాలువలో పడి ఒకరి మృతి

కాలువలో పడి ఒకరి మృతి