
మలేషియాలో తప్పిపోయిన బోధన్‌వాసి
● ఆచూకీ కనుగొని, స్వదేశానికి
రప్పించాలని కుటుంబీకుల వేడుకోలు
● ప్రవాసీ ప్రజావాణిలో
వినతిపత్రం అందజేత
బోధన్: ఉపాధి కోసం మలేషియా దేశం వెళ్లిన బోధన్ వాసి ఒకరు కొన్ని నెలల క్రితం తప్పిపోయారు. సదరు వ్యక్తి ఆచూకీ కనుగొని, స్వదేశానికి రప్పించాలని కుటుంబీకులు వేడుకుంటూ, ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని రాకాసీపేట ప్రాంతానికి చెందిన ప్యాట విజయ్ కుమార్ (38) ఉపాధి నిమిత్తం మేలో మలేషియా (కౌలాలంపూర్)కు వెళ్లాడు. అక్కడ విధుల్లో చేరిన రెండు రోజులనంతరం మానసికంగా కుంగిపోయి అసహనంతో ప్రవర్తిస్తున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే అతడిని తిరిగి తీసుకొచ్చేందుకు టిక్కెట్ కోసం ఏజెంట్‌కు రూ.30 వేలను కుటుంబీకులు పంపించారు. కానీ జూన్ 6 నుంచి అతడి జాడ తెలియకుండాపోయింది. ఈవిషయమై తెలంగాణ ఎన్నారై విభాగం నుంచి మలేషియాలోని ఇండియన్ హైకమిషన్‌కు సమాచారం ఇచ్చినట్టు కుటుంబీకులు తెలిపారు. ఈక్రమంలో తన భర్త ఆచూకీ వెతికి స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆయన భార్య జ్యోతి హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. అలాగే ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, కలెక్టర్, బోధన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు కుటుంబీకులు వెల్లడించారు.