
ప్రసవాలు చేసే వైద్యులేరీ?
● బాల్కొండ ప్రభుత్వాస్పత్రిలో
గైనకాలజిస్ట్ కరువు
● ఇబ్బందులు పడుతున్న గర్భిణులు
బాల్కొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి లో ప్రసవాలు నిలిచిపోయాయి. గత కొన్నాళ్లుగా పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేకున్నా గైనకాలజిస్ట్ ఉండటంతో ప్రతి మంగళ, శుక్రవారల్లో రెండు రోజులు ఆపరేషన్లు చేసి కాన్పులు చేశారు. ప్రస్తుతం ఆ గైనకాలజిస్టు సైతం బదిలీపై బోధన్ వెళ్లడంతో కాన్పులు నిలిచి పోయాయి. మరో వైద్యురాలు జనరల్ సర్జన్ బదిలీపై వచ్చారు. కానీ ఇక్కడ మూడు రోజులు, మరో ఆస్పత్రిలో మూడు రోజులు వైద్యసేవలను అందిస్తుంది. కనీసం నలుగురు వైద్యులు ఉండాల్సిన ఆస్పత్రిలో ప్రస్తుతం ఒక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. దీంతో స్థానిక గర్భిణులు ప్రసవాల కోసం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. కానీ జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఆర్మూర్ వెళ్లాలంటే కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ ఇటీవల ఆస్పత్రిని తనిఖీ చేయగా, వైద్యులను నియమించి, ప్రసవాలు ప్రారంభిస్తామని తెలిపారు. కానీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వైద్యుల కొరతపై సంబంధిత అధికారులను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు. ఇప్పటికై నా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రిలో వెంటనే గైనకాలజిస్ట్‌ను నియామించాలని మండల ప్రజలు కోరుతున్నారు.