
రైతు లాభపడేనా!
ఆర్మూర్ : జిల్లాలో ఎర్రజొన్న విత్తన వ్యాపారంపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో గిట్టుబాటు ధర విషయంలో ప్రతి ఏటా రైతులు వ్యాపారుల చేతుల్లో నష్టపోతూనే ఉన్నారు. వ్యవసాయ అధికారులు విత్తన వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి బై బ్యాక్ ఒప్పందం చేసుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సూచిస్తారు. అయితే ఎలాంటి చట్ట బద్ధత లేకపోవడంతో కొనుగోలు సమయంలో వ్యాపారులు బై బ్యాక్ ఒప్పందాలను బుట్ట దాఖలు చేస్తున్నారు. అతి తక్కువ ధరకు పంటను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆనవాయితీగా మారింది. ఇదే విధంగా గతేడాది మోర్తాడ్‌లో క్వింటాలుకు రూ.3,800 పలికిన ధర చివరికి వచ్చే సరికి ఆర్మూర్ మండలం మిర్దాపల్లిలో రూ.3,300లకు కొనుగోలు చేసారు.
● ఈ ఏడాది సైతం రైతులు విత్తన వ్యాపారుల కుట్రకు నష్ట పోనున్నారు. త్వరలోనే అధికారులు బై బ్యాక్ ఒప్పందంపై వ్యాపారులు, రైతులతో అవగాహన సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా కొందరు రైతులు ఇప్పటికే విత్తన వ్యాపారులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నారు.
● ఈ ఏడాది తాజాగా ఇటీవల జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలో క్వింటాలు ఎర్రజొన్నకు రూ.3,400 ధర ఇచ్చేందుకు రైతుతో విత్తన వ్యాపారి బై బ్యాక్ ఒప్పందాన్ని చేసుకున్నాడు.
అదేవిధంగా మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతులతో తెల్లజొన్న క్వింటాలుకు రూ.3,900 ధర చెల్లిస్తానంటూ పదిహేను రోజుల క్రితం వ్యాపారి బై బ్యాక్ ఒప్పందం చేసుకున్నారు. అయితే విత్తన వ్యాపారి విత్తనాన్ని సరఫరా చేయకుండా రైతుల ఫోన్‌లకు స్పందించడం లేదు. ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే కొనుగోళ్ల సమయానికి పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని రైతులంతా ఒక్కతాటిపై ఉండి ఒకే రేటుతో వ్యాపారులతో బై బ్యాక్ ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని అధికారులు ఖచ్చితంగా అమలు చేయిస్తే గాని ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జిల్లాలో ఎర్రజొన్న వ్యాపారం...
జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా ఎర్ర, తెల్లజొన్న విత్తనాలను రైతులు పండిస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని అంకాపూర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామా ల్లో సుమారు 40పైగా విత్తన కంపెనీలు ఉన్నాయి. ఈ విత్తన వ్యాపారులు ప్రతిఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో రైతులతో బై బ్యాక్ ఒప్పందం చేసుకొని ఎర్రజొన్నల ఫౌండేషన్ విత్తనం సరఫరా చేస్తుంటారు. పంట ఫిబ్రవరి మాసంలో చేతికి రా గానే ఫౌండేషన్ విత్తనం ఇచ్చిన వ్యాపారే తిరిగి రై తుల నుంచి కొనుగోలు చేస్తాడు. ఆ విత్తనాలను శుద్ధిచేసి, ప్యాకింగ్ చేసి ఉత్తర భారతదేశంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా తదితర దేశాల్లో అధిక ధరకు అమ్ముతుంటారు. ఈ విత్తనాలతో ఉత్తర భారతదేశంలో పశువుల దాణా కోసం ఉప యోగించే గడ్డిని పెంచుతుంటారు. అయితే దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో అందులో జిల్లాలో ని భూములు మాత్రమే ఎర్రజొన్న విత్తనాల సాగు కు అనువుగా ఉన్నాయి. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో 10 శాతం ఎర్రజొన్న విత్తనాలు పండించగా నిజామాబాద్ జిల్లాతోపాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మిగిలిన 90 శాతం పండిస్తారు. జిల్లాలోనే సుమారు 30 వేల ఎకరాలకు పైగా ఎర్రజొన్న పంటను సాగు చేస్తారు. అయితే విత్తన వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు
సమావేశం నిర్వహిస్తాం
ఎర్రజొన్నల బైబ్యాక్ ఒప్పందాల విషయంలో కలెక్టర్ సూచనల మేరకు త్వరలో విత్తన వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తాం. కమర్షియల్ క్రాప్ కావ డం, ఎంఎస్‌పీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వం గిట్టుబాటు ధర నిర్ణయించడం లేదు. దీనిని ఆసరాగా చేసుకొని వ్యాపారస్తులు ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు. రైతులు ఐకమత్యంగా పంటను విక్రయిస్తే వ్యాపారస్తుల మోసాన్ని నియంత్రించవచ్చు. – హరికృష్ణ, ఏవో, ఆర్మూర్
రైతులు అనుసరిస్తున్న పంట మార్పిడి విధానంతో జిల్లాలోని అధిక మొత్తంలో రైతులు యాసంగిలో ఎర్రజొన్న పంటను విత్తుతుంటారు. విత్తన వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా ఇప్పటికే గ్రామాల్లో ఈ ఏడాది అధిక వర్షాలతో పంట విస్తీర్ణం పెరిగి దిగుబడి గణనీయంగా వచ్చిందని, అందువల్ల రైతులు ఆశించిన ధర రాదంటూ ప్రచారం ప్రారంభించారు. రైతులు విత్తన వ్యాపారులు సూచించిన అతి తక్కువ ధరకే పంటను అమ్ముకొనే విధంగా ఒప్పందం చేసుకోవాలంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ఎత్తుగడలో విత్తన వ్యాపారులు విజయం సాధిస్తే రైతులు రూ.కోట్లలో నష్టపోయే పరిస్థితి నెలకొంది.
ఎత్తుగడకు తెరలేపిన వ్యాపారులు
ప్రతి ఏటా బైబ్యాక్
ఒప్పందాల ఉల్లంఘన
పంటను తక్కువ ధరకే
కొనుగోలు చేస్తున్న విత్తన వ్యాపారులు
అధిక వర్షాలతో దిగుబడులు
పెరిగాయని, ఆశించిన రేటు రాదని గ్రామాల్లో ఏజెంట్ల ప్రచారం