
ఆర్టీసీకి దసరా బొనాంజ
● రూ.19.53 కోట్ల ఆదాయం
● రెండో స్థానంలో నిజామాబాద్ రీజియన్
ఖలీల్‌వాడి: ఆర్టీసీకి దసరా పండుగ సందర్భంగా ల క్ష్యానికి మించి ఆదాయం వచ్చినట్లు నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న వెల్లడించారు. రీజియన్ పరిధిలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపింది. షెడ్యూల్ సర్వీస్‌కి అదనంగా 566 ప్రత్యేక బస్సులను నడపగా, ఆదాయ పరంగా రాష్ట్రంలోనే నిజామాబాద్ రీజియన్ రెండో స్థానం సాధించింది. రూ.18 కోట్లు టార్గెట్‌గా నిర్ణయించగా రూ.19.53 కోట్ల రాబడి వచ్చింది. నిజామాబాద్ ప్రాంతానికి రూ.1.17 కోట్లు లక్ష్యం విధించగా, రూ.1.19 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ సందర్భంగా మంగళవారం డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని ఆర్‌ఎం అభినందించారు.