
నరాలు తెగే ఉత్కంఠ !
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం బీసీలకు 42 శాతం అమలు చేస్తూ ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈనెల 8వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు తీర్పు ఆధారంగానే ప్రభుత్వం ఎన్నికలపై ముందుకు వెళ్లే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలు, 307 ఎంపీటీసీ స్థానాలు, 31 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు గత నెల 27న షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 9 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరిస్తామని, రెండు విడతల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొంది. అదేవిధంగా గ్రామపంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం షె డ్యూల్ ప్రకారం చివరి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది.
కలిసొచ్చిన నేతల హడావుడి..
గ్రామాల్లో రిజర్వేషన్లు కలిసొచ్చిన నేతలు ప్రజలను కలుస్తూ మమేకమవుతున్నారు. కుల పెద్ద లు, గ్రామ పెద్దలకు విందులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. కులసంఘాలు, యువజన సంఘాలను ప్రలోభాలకు గురి చేసే పనిలో నిమగ్నమయ్యారు. రిజర్వేషన్లు కలిసి రాని నాయకు లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు మా రుతాయనే ధీమాతో ఉన్నారు. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే ఆశతో ఉన్నారు. కోర్టు తీర్పుపై నాయకుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
ఎదురుచూస్తున్న ఆశావహులు
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ.. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కన్పించడం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే.. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. 8వ తేదీవరకూ వేచి ఉండాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. అంతలోనే మరికొంద రు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పిటీషన్‌ను తిరస్కరించింది. బుధవారం హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని ఆశావహులు, ఆయా పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా కోర్టు తీర్పు ఏమిస్తుందోనని ఉద్విగ్నంగా గడుపుతున్నారు. ప్రజలు సైతం ఎన్నికలు ఉంటాయో.. లేవోనని చర్చించుకుంటున్నారు.
బీసీ రిజర్వేషన్లపై
నేడు హైకోర్టులో వాదనలు
తీర్పు ఆధారంగానే ఎన్నికలపై
ముందుకు వెళ్లనున్న ప్రభుత్వం