నీరుగారుతున్న స.హ చట్టం | - | Sakshi
Sakshi News home page

నీరుగారుతున్న స.హ చట్టం

Oct 7 2025 3:26 AM | Updated on Oct 7 2025 3:26 AM

నీరుగారుతున్న స.హ చట్టం

నీరుగారుతున్న స.హ చట్టం

కప్పదాటు వైఖరి.. పెరిగిన అప్పిళ్లు, ఫిర్యాదులు

కమిషన్‌ సమీక్షలు చేయాలి

● బాల్కొండ మండల కేంద్రానికి చెందిన ఒకరు రెండేళ్లలో సస్పెండ్‌ అయిన ఉపాధ్యాయుల వివరాలు కావాలని విద్యాశాఖ అధికారి కార్యాలయానికి దరఖాస్తు చేశారు. దీంతో సెక్షన్‌(8)జె ప్రకారం వ్యక్తిగత సమాచారం అంటూ దరఖాస్తును తిరస్కరించారు.

● జక్రాన్‌పల్లి మండలానికి చెందిన ఓ దరఖాస్తుదారుడు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ అక్రమాలపై వివరాలు కోరగా అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. మొదటి అప్పీల్‌కు వెళ్లగానే తర్వాత సమాచారం కోసం సొమ్ము కట్టాలని సందేశం అందింది.

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వం గుప్పిట్లో ఉన్న సమాచారం, సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే హక్కును సామాన్యుడి చేతికి అందించిన ఆయుధం సమాచార హక్కు (సహ) చట్టం. 20 ఏళ్లుగా పౌరులు ఈ చట్టంతో సమస్యలను పరిష్కరించడమే కాకుండా అవినీతిని ఎండగట్టగలిగారు. అయితే జిల్లాలో ప్రస్తుతం చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సహ చట్టం అమలు తీరు అధ్వానంగా మారింది. నేడు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అప్పిళ్లు, ఫిర్యాదులపై సమాచార కమిషన్‌ సమీక్ష చేస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

సమాచార హక్కు చట్టం సెక్షన్‌–6 ద్వారా వచ్చిన దరఖాస్తులను సదరు ప్రజా సమాచార అధికారులు పట్టించుకోవడం లేదు. సెక్షన్‌–7(1) ప్రకారం 30 రోజులలో ఇవ్వాల్సిన సమాచారాన్ని నెలలు గడిచినా ఇవ్వడం లేదు. ప్రతి ఏడాది సహ చట్టంపై శిక్షణ పొందుతున్న అధికారులు నిబంధనలను మాత్రం పాటించడం లేదు.

● జక్రాన్‌పల్లి మండలానికి చెందిన పౌరుడు ఆర్మూర్‌ విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయంలో నిజామాబాద్‌ డివిజన్‌కు చెందిన సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును సెక్షన్‌6(3) ప్రకారం ఐదు రోజుల్లో బదిలీ చేయాలి. కాగా, దరఖాస్తుకు సంబంధించిన వివరాలు తమ దగ్గర లేవని సమాచారం ఇచ్చారు. సహ చట్టం ప్రాథమిక అంశాలు తెలిసినా సదరు పీఐవో తమకేమీ తెలియదనట్టు ప్రవర్తించాడు.

● కామారెడ్డి జిల్లాలో రెవెన్యూ, నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ కార్యాలయాలు సమాచారం ఇవ్వడం లేదంటూ ఇటీవల స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఒక ప్రజాప్రతినిధికే సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగితే సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటని సహోద్యమకారులు ప్రశ్నిస్తున్నారు.

● ఉమ్మడి జిల్లాలో చాలా కార్యాలయాలు 4(1)బికి చెందిన 17 అంశాలు స్వచ్ఛందంగా వెల్లడించడం లేదు. జిల్లా విద్యాశాఖ సమాచారం ఇవ్వడంలో అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. సెక్షన్‌ 8ని సాకుగా చూపి సమాచారం ఇవ్వడంలో సదరు పౌర సమాచార అధికారి సహాయ నిరాకరణ చేస్తున్నారు.

జిల్లా నుంచి సమాచార కమిషన్‌లో 271 అప్పిళ్లు, 189 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా రెవెన్యూ, విద్యా శాఖ, వైద్యం, పంచాయతీ రాజ్‌ శాఖలకు చెందిన సహ దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలకోసారి సహ చట్టం అమలుపై నిర్వహించాల్సిన సమీక్షలు గత కొన్ని నెలలుగా జరగడం లేదు.

ఉమ్మడి జిల్లాలో సహ చట్టం అమలుతీరుపై సమాచార కమిషన్‌ మూడునెలలకోసారి సమీక్షించాలి. జిల్లా శాఖల్లో సహ చట్టం అమలు తీరు బాగుంది. కానీ, మండల స్థాయిలో నామమాత్రంగా తయారైంది. సెక్షన్‌ 4(1) 17 అంశాల సమాచారం అన్ని శాఖలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. దరఖాస్తుదారుల కూడా సరైన పద్ధతులు పాటిస్తే అధికారులు సమాచారం ఇవ్వడానికి సులువుగా ఉంటుంది. – అంకం నరేశ్‌, కోకన్వీనర్‌, యూఎఫ్‌ఆర్‌టీఐ

సమాచారం ఇవ్వడంలో

అధికారుల నిర్లక్ష్యం

పేరుకుపోతున్న దరఖాస్తులు

నేడు జిల్లా కేంద్రంలో

సమాచార కమిషన్‌ సమీక్ష

పెండింగ్‌ అప్పీళ్లు, ఫిర్యాదులపై విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement