
అనుమతిలేని ఆస్పత్రులు
ఇక్కడ ఓపీ.. రాజధానిలో ట్రీట్‌మెంట్
● దర్జాగా ఫీజుల వసూలు
● ఫిర్యాదులను పట్టించుకోని వైద్యశాఖ
● నోటీసులతో సరిపెడుతున్న వైనం
నగరానికి చెందిన సుమలత 11.07. 2025 నాడు థైరాయిడ్ సమస్యతో ఖలీల్‌వాడీ లో ఓ ఆస్పత్రి ఏర్పాటు చేసిన బ్రాంచి ఆస్పత్రికి వెళ్లారు. కన్సల్టేషన్ ఫీజు రూ. 600 చెల్లించారు. అయితే ఇతర రోగికి సంబంధించిన ట్రీట్‌మెంట్ మందులు రాసి ఫైల్ తన చేతిలో పెట్టారు. బాధితురాలు వైద్యుడినే కలవలేదు.. చూపించుకోలేదు.. అయినా అవే మందులు వాడాలని సిబ్బంది సలహా ఇచ్చారు. ఆమె భర్త పలుమార్లు ప్రశ్నించడంతో పాటు ఇంత పెద్ద ఆస్పత్రి పేరు పెట్టుకొని ఒకరి రోగంపై మరొకరి మందులు రాయడంపై మండిపడ్డారు. అనంతరం నేరుగా కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై రాతపూర్వకంగా విన్నవించారు. అయినా ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి జవాబు లేదు.
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి. రెండు, మూడు సంవత్సరాల నుంచి కొత్తగా ఏర్పడుతున్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు కనీస అనుమతులు ఉండటం లేదు. అయినా, దర్జాగా రోగుల వద్ద ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రధానంగా నగరంలోని ఖలీల్‌వాడీ, ద్వారకా నగర్, ప్రగతినగర్, హైదరాబాద్ రోడ్, కంఠేశ్వర్ రోడ్, బోధన్ రోడ్, వర్ని రోడ్ తదితర ప్రాంతాల్లో సుమారు 400 పైగా ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 870 పైగా ఆస్పత్రులకు వైద్యశాఖ అనుమతులు జారీ చేసింది. ఇందులో సుమారు 40 ఆస్పత్రులకు తాత్కాలిక అనుమతులు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో మల్టీ, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ తదితర తోక పేర్లతో పదుల సంఖ్యలో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఫిర్యాదు చేయడమే గగనం. అధికారులు మాత్రం ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతుంటారు. కానీ, ఫిర్యాదు వస్తే మాత్రం తూతూ మాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ఫిర్యాదు దారుకు చెప్పడం లేదంటేనే అర్థమవుతోంది. కాగా, వైద్యశాఖలోని కొంతమంది ఉద్యోగులు ముడుపులు అందుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేట్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటే కచ్చి తంగా వైద్యారోగ్యశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మొదట తాత్కా లిక అనుమతి తప్పనిసరి. అయితే జిల్లాలో ని పలు ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యారోగ్యశా ఖ అనుమతితో సంబంధం లేకుండా సేవ లు అందిస్తున్నాయి. రోగుల నుంచి రూ. 400నుంచి రూ.600 పైగా ఫీజులు వసూలు చేసి ఓపీ సేవలందిస్తున్నామని నిర్వాహకు లు చెబుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో కొత్త సంస్కృతికి తెరలేపారు. హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రుల పేరిట జిల్లాలో అక్కడక్కడా బ్రాంచీలను ఏర్పాటు చేశారు. కనీస అనుమతి లేకుండా ఓపీ సేవలు అందించొద్దనే నిబంధనలను తుంగలో తొక్కి ఫీజులు దండుకుంటున్నారు. రోగులను భ యపెడుతూ హైదరాబాద్‌లోని పలు ఆస్ప త్రులకు రిఫర్ చేస్తున్నట్లు సమాచారం.