
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
● బైక్ యాత్రకు స్వాగతం
నిజామాబాద్ లీగల్: గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ చేపట్టిన బైక్ యాత్ర బుధవారం జిల్లాకు చేరుకుంది. సూర్యాపేట జిల్లా గోరంట్ల జెడ్పీ హైస్కూల్‌లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రభాకర్ తన స్నేహితుడు గంజాయి వాడకంతో మృతి చెందడంపై కలత చెందాడు. దీంతో గంజాయి, డ్రగ్స్ వాడకంతో కలుగుతున్న అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సొంత ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్ర నిర్వహిస్తున్నాడు. యాత్ర లో భాగంగా రద్దీ ప్రదేశాలు, సంతలు, మార్కెట్లలో ప్రభాకర్ ఓ ప్రత్యేకమైన నల్లని షర్టు వేసుకుని, దానిపై పుర్రె గుర్తు ఉన్న దండ ధరించి గంజాయి, మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 21న ప్రారంభమైన ఈ యాత్ర బుధవారం నిర్మల్ జిల్లా బాసర మీదుగా నిజామాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభాకర్‌కు నిజామాబాద్ కోర్టు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీనర్సయ్య, నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, బార్ అసోసియేషన్ కార్యదర్శి మాణిక్ రాజ్, అడ్వొకేట్లు మాడవేడి శ్యామ్‌కుమార్, రవిప్రసాద్, ఆశా నారాయణ, రెంజర్ల సురేశ్ స్వాగతం పలికారు. యాత్ర నిర్వహణపై అభినందిస్తూ ప్రభాకర్‌ను సన్మానించారు.