
వందేళ్లలో తొలిసారి..
నిజాంసాగర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 44 రోజుల వ్యవధిలోనే 237.9 టీఎంసీల ఇన్‌ఫ్లో రావడం గమనార్హం. వందేళ్ల చరిత్ర కలిగిన ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరదలు రావడం ఇది తొలిసారి..
నిజాం కాలంలో మంజీర నదిపై అచ్చంపేట వద్ద భారీ జలాశయం నిర్మాణం ప్రారంభించారు. 1923లో ప్రారంభమైన నిర్మాణం 1931లో పూర్తయ్యింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాల తోపాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుంది.
ఆగస్టు 18న ప్రారంభమైన ఇన్‌ఫ్లో..
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది ఆగస్టులో ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. ఆ నెలలో భారీ వర్షాలు కురవడంతో 111.53 టీఎంసీల నీరు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లోనూ వరుణుడి జోరు కొనసాగడంతో మరో 126.41 టీఎంసీలు జత కలిసింది. మొత్తం 44 రోజుల వ్యవధిలో 237.94 టీఎంసీల ఇన్‌ఫ్లో రావడం గమనార్హం. వందేళ్ల ప్రాజెక్టు చరిత్రలో ఇది రికార్డ్ కావడం గమనార్హం. అంతకుముందు 1983 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టు భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. ఆ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి 163 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఆ తర్వాత ఈ స్థాయికి మించి వరదలు రావడం ఇదే తొలిసారి.
ఒక రోజులో రెండో అత్యధికం
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1962 సంవత్సరంలో భారీ వరదలు వచ్చాయి. ఒక రోజులో ప్రాజెక్టు చరిత్రలో గరిష్టంగా 4.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయ్యింది. 1988 సంవత్సరంలో 2 లక్షల క్యూసెక్కులు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ ఒక రోజులో గరిష్ట ఇన్‌ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు దాటలేదు. ఈసారి అగస్టు 28న 2.56 లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది.
లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు బుధవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,03,516 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 1,00,056 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1,402.40 అడుగులు (14.486 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి
237.9 టీఎంసీల ఇన్‌ఫ్లో
గతంలో 1983లో
163 టీఎంసీలు చేరిక
నెలన్నరగా పరవళ్లు
తొక్కుతున్న మంజీర నది