
అధిక వర్షాలతో పరేషాన్
ప్రభుత్వం ఆదుకోవాలి
● పంటలను వెంటాడుతున్న వాన
● దెబ్బతిన్న మొక్కజొన్న, సోయా
● ఆందోళన చెందుతున్న రైతులు
బాల్కొండ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులను అధిక వర్షాలు ఇబ్బందుల్లో పడేశాయి. ఇటీవల కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు అధికమై పంట భూముల్లో నీరు ఉబికి వస్తుంది. భూముల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో పంటల ఎదుగుదల లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వర్షాలు కురుస్తుండటంతో పంట దిగుబడులు తడిసి ముద్దవుతున్నాయి. అతివృష్టితో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు తికమకపడుతున్నారు.
తడుస్తున్న పంట దిగుబడులు
సెెప్టెంబర్ చివరిలో సైతం వర్షాలు కురుస్తుండటంతో చేతికొచ్చిన మొక్కజొన్న, సోయాలు తడిసిపోతున్నాయి. నూర్పిడి చేసి ఆరబెట్టిన మక్కలు ముక్కిపోతున్నాయి. తడిసిన మక్కలను ఆరబెట్టడంలో రైతులు నిమగ్నమయ్యారు. మరోవైపు వర్షం కురుస్తుండడంతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పసుపు పంటకు తేమ ఎఫెక్ట్..
అధిక పెట్టుబడి, గంపెడు ఆశలతో సాగు చేసే పసుపు పంట వర్షాలతో తీవ్రంగా దెబ్బతింటుంది. మోతాదు వర్షంతోనే పసుపు పంటకు మేలు. నిత్యం వర్షాలు కురుస్తుండటంతో నేలల్లో తేమ శాతం అధికమై పసుపు పంటకు దుంపకుళ్లు సోకుతుంది. అంతే కాకుండా ఎదుగుదల లేకుండా పోతోంది. ఇప్పటి వరకు 50 శాతం మేర పసుపు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది పచ్చి కరువు వచ్చి పడింది. రోజూ వర్షం పడుతుండటంతో భూములన్నీ తడిగా ఉన్నాయి. పసుపు పంట నీరు పట్టి పోయింది. దుంపలు తీస్తే వాసన వస్తుంది. ఇంకా వానలు కురుస్తునే ఉన్నాయి. మక్కలు ముక్కిపోతున్నాయి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – నడ్కుడ నర్సయ్య, రైతు, రెంజర్ల

అధిక వర్షాలతో పరేషాన్