
సమస్య ఏదైనా వాట్సాప్‌లో పరిష్కారం
సాంకేతికత సాయంతో కేవీకే..
● సోషల్ మీడియాలో ప్రభుత్వ శాఖలు
● వాట్సాప్, యాప్‌ల ద్వారా
సలహాలు, సూచనలు
కమ్మర్‌పల్లి: సామాజిక మాధ్యమాల వినియోగంలోకి ప్రభుత్వ శాఖలు చేరాయి. సామాజిక మాధ్యమాల వేదికగా సలహాలు, సూచనలు ఇస్తూ, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతూ ప్రజలకు చేరువవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ సేవలతోపాటు యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి శాఖల వారీగా ఒక నెంబర్‌ను కేటాయించాయి. అందులో మెసేజ్ చేస్తే చాలు.. అవసరమైన సలహాలు పొందడంతోపాటు సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించారు. మరికొన్ని శాఖల్లో ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కరించి తిరిగి వినియోగదారులకు సమాచారం అందించేలా యాప్‌లను రూపొందించారు.
జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సీజన్ల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ సూచనలు, తదితర వాటిని నేరుగా రైతుల సెల్‌ఫోన్‌కు సందేశం రూపంలో పంపించేలా ఏర్పాట్లు చేశారు. సమాచారం పొందాలనుకునే రైతులు ముందుగా తమ పేరు, పూర్తి వివరాలు, ఫోన్ నంబర్లను కృషి విజ్ఞాన కేంద్రంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో వ్యవసాయ సమాచారం నిమిత్తం ప్రస్తుతం 100కు పైగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అందులో 10 వేల మందికి పైగా రైతులకు సమాచారం వెళ్తుందని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.