
పండుగ పూట పస్తులేనా..?
● ఉపాధిహామీ పథకం కూలీలకు
నాలుగు నెలలుగా అందని కూలి సొమ్ము
● ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వైనం
మోర్తాడ్(బాల్కొండ): ఉపాధిహామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు నెలల తరబడి కూలి సొమ్ము చెల్లింపులు నిలిచిపోయాయి. ఒక వారంలో పని చేసిన కూలీలకు మరుసటి వారంలో లేదా పక్షం రోజుల్లోనే చెల్లింపులు చేయాలని ఉపాధి హామీ చట్టంలోనే నిర్ధేశించారు. కానీ నాలుగు నెలలుగా కూలీలకు వారు చేసిన పనులకు కూలి చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో రూ.16 కోట్ల బకాయిలు..
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2.50లక్షల మంది కూలీలు ఉన్నారు. ఎండకాలంలో రోజుకు సగటున లక్ష మంది వరకూ కూలీలు ఉపాధి పనులు చేసేవారు. జూన్, జూలై మాసాల్లో వర్షాలు అంతగా కురవకపోవడంతో వన మహోత్సవ కార్యక్రమంలో కూలీలు పాలుపంచుకున్నారు. అప్పట్లో రోజుకు 50వేల మంది వరకు కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. మే 22 వరకు చేసిన ఉపాధి పనులకే కూలి సొమ్మును చెల్లించారు. అప్పటి నుంచి పనిచేసిన పనులకు నిధులు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలోని ఉపాధి కూలీలకు రూ.16 కోట్ల బకాయిలు పేరుకపోయాయి.
కేంద్ర ప్రభుత్వమే నేరుగా..
రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అందులో నుంచి కూలీలకు సొమ్మును జమ చేసేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తుందనే ఉద్దేశంతో కూలీలకే సొమ్మును నేరుగా జమ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కూలీల ఖాతా నంబర్లను సేకరించి వారికి తపాల శాఖ, బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు ఉపాధి కూలీల కూలి సొమ్ము చెల్లింపుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నా కేంద్రం నిధులను విడుదల చేయడం లేదు. దసరా పండుగ వస్తుండగా నాలుగు నెలల కూలి సొమ్ము జమ కాకపోవడంతో తాము పండుగ పూట పస్తులు ఉండాల్సిందేనా అని కూలీలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం స్పందించి కూలీలకు కూలి సొమ్ము వెంటనే జమ చేయాలని పలువురు కోరుతున్నారు.