
నిజాంసాగర్‌లోకి భారీ ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం భారీ వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం రాత్రి 77,717 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి 87,709 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రధాన కాలువకు 1,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శుక్రవారం రాత్రి వరకు 1,401.51 అడుగుల (13.088 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
కౌలాస్ ప్రాజెక్టులోకి..
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి శుక్రవారం 4,838 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు మూడు వరద గేట్లను ఎత్తి 7,614 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా 457.85 మీటర్లు (1.200 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
మంజీర నదిలో వరద పరవళ్లు
నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాటు నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతుండడం, కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్ అలుగులు పారుతుండడంతో మంజీర నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. నదిలో దాదాపు 1.30 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు ప్రవహిస్తోంది.