
ఎస్సారెస్పీలోకి 610 టీఎంసీల వరద..!
బాల్కొండ: శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు 610 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుత సంవత్సరం ఆగష్టు మాసంలోనే వరదలు ఎక్కువగా వచ్చాయి. అదే మాసంలో ప్రాజెక్ట్ నిండుకుండల మారడంతో మిగులు జలాలను గోదావరిలోకి వదలడం ప్రారంభించారు. ప్రాజెక్ట్‌కు గత పదిహేనేళ్లుగా సెప్టెంబర్ నెల వరదలకు సెంట్‌మెంట్‌గా ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం కూడ ఇప్పటి వరకు 300 టీఎంసీల వరద నీరు కేవలం సెప్టెంబర్‌మాసంలోనే వచ్చి చేరింది. గతంలో సెప్టెంబర్ వరకు ప్రాజెక్ట్ ఖాళీగా ఉండేది.
కొనసాగుతున్న వరద..
ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుంది. మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రాజెక్ట్‌ల నుంచి దిగువకు నీరు వదలడంతో లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్‌లోకి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలకడగా 3 లక్షల 15 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి 39 వరద గేట్ల ద్వారా లక్షా 61 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, అలీసాగర్ లిప్ట్ ద్వారా 360 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 600 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1086.50(65.12 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.