
పనితీరు మరింత మెరుగుపడాలి
ధర్పల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మరింత మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, తహసీల్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్‌సీ ద్వారా అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. స్వస్థ్ నారీ– సశక్త్ పరివార్ అభియాన్ భాగంగా సీహెచ్‌సీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అని పరిశీలించారు. శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి, మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలించారు. కొత్త ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని తహసీల్దార్ శాంతకు సూచించారు. తప్పిదాలకు తావు లేకుండా కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్, ఎలక్టోరల్ టేబుల్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు.