
టీచర్.. డీపీవో అయ్యాడు..
నిజామాబాద్‌అర్బన్: రెంజల్ మండల కేంద్రంలో ఉపాధ్యాయుడి(ఎస్జీటీ)గా విధులు నిర్వర్తిస్తున్న వినోద్ గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభచాటి జిల్లా పంచాయతీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. నవీపేట మండలం కోస్లి గ్రామానికి చెందిన వినోద్ తండ్రి సాయిలు రెండేళ్ల క్రితం చనిపోగా, తల్లి భోజమ్మ, తమ్ముడు దీపక్ ఉన్నారు. వీరిది వ్యవసాయ కూలీల కుటుంబం. 2022 నుంచి వినోద్ గ్రూప్–1 ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఆన్‌లైన్‌లో చదువుకుంటూ సొంతగా ప్రిపరేషన్ కొనసాగించారు. మొదటి ప్రయత్నంలోనే డీపీవోగా ఎంపికయ్యారు. కాగా, వినోద్ ఇదివరకే గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షల్లో మెరుగైన ర్యాంకు సాధించగా, ఫలితాలు వస్తే డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ‘చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, నష్టాలను ఎదుర్కొని పెరిగాను. వాటిని అడ్డుగా భావించకుండా సంకల్పంతో ముందుకు సాగాను. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించాను.’ అని వినోద్ హర్షం వ్యక్తం చేశారు.