
తెరిపినివ్వని వాన.. అన్నదాత హైరానా
నందిపేట్(ఆర్మూర్): ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నందిపేట మండలంలో భారీ వర్షంతో పొలాలు నీట మునిగి పంటలు దెబ్బతింటున్నాయి. నందిపేట, బజార్‌కొత్తూర్, మాయాపూర్, ఉమ్మెడ, బాద్గుణ, అయిలాపూర్, కంఠం, తల్వేద, చింరాజ్‌పల్లి గ్రామాలలో వరి పంట నేలకొరిగింది. సోయా పంటలు నీట మునిగాయి. మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు నందిపేట మండల కేంద్రంలోని బర్కత్‌పుర, ఎన్‌టీఆర్‌నగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, కాలువ కట్ట కాలనీలలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉదయం నుంచి జన జీవనం స్తంభించింది. మండలంలోని తల్వేద, మల్లారం, శాపూర్ గ్రామాలలోని చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి.
శాంతించని గోదారి..
రెంజల్(బోధన్): గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య నదిపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెన పైనుంచి వరద నీరు వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు రద్దయ్యాయి. స్థానిక రైతులు నది వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గోదావరి పరీవాహక గ్రామాలైన కందకుర్తి, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల్లో వేలాది ఎకరాల సోయా, వరి పంటలు నీటమునిగాయి. ఆయా గ్రామాల్లో అధికారులు దండోరా వేయించి స్థానికులు నది వైపు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు.

తెరిపినివ్వని వాన.. అన్నదాత హైరానా