
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా ఆనంద్‌కుమార్
నిజామాబాద్ నాగారం: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న కసితో ఢిల్లీలో 6 అంకెల జీతం వదులుకొని మరీ ఐదేళ్లు కఠోరంగా శ్రమించాడు. ఫలితంగా వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన ఆనంద్– కరుణ కుమారుడు మాదరి ఆనంద్‌కుమార్. నిజాంసాగర్‌లో జవహర్ నవోదయ పాఠశాలలో 2003లో పదో తరగతి పూర్తిచేశారు. 2012లో హైదరాబాద్ నైపర్‌లో ఎంఫార్మసీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో 7 సంవత్సరాలపాటు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఐదేళ్ల క్రితం జిల్లాకు తిరిగి వచ్చిన ఆయన ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భార్య తేజస్వీని(రెవెన్యూ శాఖలో ఆర్‌ఐ), ఏఆర్‌ఐ సంతోష్, రాయదాసు, హెచ్‌ఎం ఆనంద్, జీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, దేవా ప్రదీప్‌కుమార్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా చదువుకొని గ్రూప్–1, 2, 3, 4 పరీక్షలు రాశారు. 2024 డిసెంబర్‌లో విడుదలైన గ్రూప్–4 ఫలితాల్లో వాణిజ్య పన్నుల శాఖ జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. గ్రూప్–2లో రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు, గ్రూప్–3లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. తాజాగా విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో స్టేట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. ‘నన్ను అమ్మానాన్న, భార్య తేజస్వీని ప్రోత్సహించారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.’ అని ఆనంద్ చెప్పారు.