
తండ్రి కిరాణా వ్యాపారి.. కూతురు గ్రూప్–1 ఉద్యోగి
నిజామాబాద్‌అర్బన్: తండ్రి కిరాణా షాప్ నిర్వాహకుడు. కొడుకు, కూతుళ్లను ఉన్నత ఉద్యోగాల్లో చూడాలని కలలు కన్నాడు. అందుకు అనుగుణంగానే కూతురు గ్రూప్–1 ఉద్యోగం సాధించి తండ్రి ఆశయాన్ని నిలబెట్టింది. మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనిధి గ్రూప్–1 ఫలిత్లాలో ఎంపీడీవోగా ఉద్యోగం సాధించింది. చిన్నప్పటి నుంచి శ్రీనిధికి సివిల్స్ సాధించాలనే పట్టుదల ఉండేది. దానికి అనుగుణంగానే తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహించారు. తండ్రి నరేందర్ గ్రామంలో కిరాణాషాప్ నిర్వహిస్తుండగా తల్లి కృష్ణవేణి గృహిణి. పదో తరగతి వరకు గ్రామంలోని చదివిన శ్రీనిధి, ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. అనంతరం ఐఏఎస్ అకాడమీలో శిక్షణకు చేరింది. సివిల్స్ సాధించాలని లక్ష్యం పెట్టుకున్న ఆమె.. మొదటిసారిగా గ్రూప్–1 పరీక్ష రాసింది. నిధి ఎంపీడీవోగా ఉద్యోగం సాధించడంపై మామిడిపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ‘తల్లిదండ్రుల ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. వారి ఆశయాలకు అనుగుణంగా చదివాను. నన్ను ఎంతో కష్టపడి చదివించారు. సివిల్స్ సాధించే వరకు విశ్రమించను.’ అని శ్రీనిధి చెబుతోంది.