
ప్రణాళిక ప్రకారం చదవాలి
లక్ష్మణచాంద: విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు సలహాలు, సూచనలు చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించా లన్నారు. ప్రతీ వారం స్లిప్ టెస్టులు నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రాగి జావా వారంలో రెండు రోజులు విద్యార్థులకు అందించాలని కోరారు. పాఠశాలలోని పలు రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. ఫార్మేటివ్ 1, 2 మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆర్.అశోక్‌వర్మ, తహసీల్దార్ శ్రీలత, మండల అభివృద్ధి అధికారి రాధ, సీఆర్పీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.