
విట్టోలి చెరువుకు గండి
ముధోల్: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఈ క్రమంలో మండలంలోని విట్టోలి రాళ్ల చెరువులోకి సోమవారం రాత్రి భారీగా వరద రావడంతో కట్ట తెగిపోయింది. దీంతో కింద ఉన్న పత్తి, వరి పంటలు నీటమునిగాయి. చేతికి వచ్చిన సోయా పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అధికారులు రాళ్ల చెరువుకు యుద్ధ ప్రతిపాదికగా మరమ్మతులు చేపట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. చెరువుకు గండి పడే అవకాశం ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.