
అపార్ నమోదు ఆలస్యం
లక్ష్మణచాంద: విద్యార్థులకు ప్రత్యేక శాశ్వత గుర్తింపు నంబర్ ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. ‘ఒకే దేశం–ఒకే విద్యార్థి గుర్తింపు నంబర్‘ అనే నినాదంపై రూపొందిన ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి జీవితాంతం ఒకే అకాడమిక్ నంబర్ ఇవ్వబడుతుంది.
జిల్లాలో నమోదులో స్థితి
జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రకారం, మొత్తం 1,42,872 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటివరకు 96,157 మంది వివరాలు నమోదు చేశారు. మొత్తం నమోదు శాతం 67.34గా ఉంది. ఇంకా 45,962 మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అధికారులు ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.
మండలాల ప్రగతి
జిల్లాలో లక్ష్మణచాంద మండలం 79.45 శాతంతో ముందంజలో ఉంది. భైంసా మండలం 79.09 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. పెంబి మండలం 43.15 శాతం నమోదుతో చివరిస్థానంలో కొనసాగుతోంది. మిగతా మండలాల్లో నమోదు శాతం 60కు పైగా చేరిందని అధికారులు పేర్కొన్నారు.
ఆలస్యానికి ప్రధాన కారణాలు
జిల్లాలో అపార్ నమోదులో జాప్యానికి విద్యార్థుల వ్యక్తిగత వివరాలు సక్రమంగా ఇవ్వనికారణంగానే జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఈ కారణాల వల్ల నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు వివరించారు.
అవగాహనతో వేగవంతం
జిల్లాలో 1,42,872 మంది విద్యార్థుల్లో 96,157 మంది నమోదు పూర్తిచేశాం. మిగిలిన విద్యార్థులు కూడా త్వరగా నమోదు చేసుకునేలా ప్రధానో పాధ్యాయులు సమావేశాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించాం. తద్వారా జిల్లాలో శాతం 100 చేరుకునేలా చర్యలు తీసుకుంటాం.
– భోజన్న, జిల్లా విద్యాధికారి