
దసరా సెలవుల్లో రెచ్చిపోయిన దొంగలు
నిర్మల్‌టౌన్: బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కళాశాలలకు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో పెద్ద పండుగ కావడంతో అందరూ ఇళ్లకు తాళం వేసి సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, తీర్థయాత్రలకు వెళ్లారు. ఇదే అదనుగా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాలు, ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలే లక్ష్యంగా దొంగతనాలు చేశారు. తమ చోరకళను ప్రదర్శిస్తూ పోలీసులకు చెమటలు పట్టించారు.
రోజుకో చోరీ వెలుగులోకి..
జిల్లాలో దసరా సెలవులు మొదలైన నాటి నుంచి రోజుకో పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు జరిగాయి నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో ఒకటికి మించి దొంగతనాలు జరిగాయి. నగదు, బంగారం, విలువైన వస్తువులు, బైక్‌లు, స్కూటర్లు వరకు ఎత్తుకెళ్లారు.
పోలీసులకు చిక్కకుండా..
నిఘా వ్యవస్థ అభివృద్ధి చెందినా, దొంగలు చోరీ చేసిన ఇళ్లలో ఎలాంటి ఆనవాళ్లు వదలలేదు. రాత్రింబవళ్లు గస్తీ ఉన్నా, పోలీసుల కంట పడకుండా దొంగలు తమ పని కానిచ్చేశారు. కొన్ని నెలలుగా జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పక్క రాష్ట్ర గ్యాంగులేనా?
నిర్మల్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉండడం, 44, 61 జాతీయ రహదారుల ద్వారా తరచుగా రాకపోకలు సాగడంతో పక్క రాష్ట్రాల గ్యాంగులు వచ్చి దొంగతనాలు చేసి పారిపోతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు విచారణను ముమ్మరం చేస్తున్నారు. అయితే దొంగలు మాత్రం పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.
పగలు రాత్రి తేడా లేకుండా..
ఇప్పటివరకు ఎక్కువగా రాత్రులే దొంగతనాలు జరిగినప్పటికీ, ఈసారి పగలు రాత్రి తేడా లేకుండా దొంగలు రెచ్చిపోయారు. పగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేశారు. ఇంటి బయట నిలిపిన వాహనాలూ ఎత్తుకెళ్లారు.