
కూలిన లోలెవల్ కాజ్వే..
చెన్నూర్రూరల్: మండలంలోని శివలింగాపూర్ గ్రామం నుంచి అక్కెపల్లి గ్రామానికి వెళ్లే దారిలో వాగుపై ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన లోలెవల్ కాజ్వే పూర్తిగా కూలిపోయింది. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగిన సమయంలో కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహించి పూర్తిగా దెబ్బతింది. గత నాలుగేళ్ల క్రితం కాజ్వేపై గుంత ఏర్పడింది. అది కాస్త పెద్దగా మారి మొత్తం కూలిపోయింది. గతంలో వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ పనులు చేపట్టపోవడంతో వెనక్కి వెళ్లాయి. కొద్ది రోజుల క్రితం గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. కానీ ఒక్క వర్షానికే వాగు ఉప్పొంగి అదీ కొట్టుకుపోయింది. దీంతో మళ్లీ ఎప్పటిలాగే మారింది. భారీ వర్షాలకు వాగు ఉప్పొంగితే గుంతలు ఎక్కడున్నాయో తెలియక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.