
కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యం
● స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూకీలకంగా వ్యవహరించాలి
● ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పర్ణికారెడ్డి, రాజేశ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని ప్రజలకు నిజాలు తెలియజేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు.