
పరిషత్‌కు నోడల్ ఆఫీసర్ల నియామకం
● 12 మంది అధికారులకు
బాధ్యతల అప్పగింత
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పరిషత్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కొక్క పని పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా సైతం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ పరిషత్ స్థానాల వారిగా ఖరారు చేశారు. అలాగే ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కలెక్టర్ విజయేందిర ఆయా శాఖల అధికారులతో సమీక్షించడంతోపాటు రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం సైతం నిర్వహించిచారు. అలాగే ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 12 మందిని నోడల్ అధికారులుగా నియమించారు.
930 పోలింగ్ స్టేషన్లు..
జిల్లాలో 16 జెడ్పీటీసీ, 175 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా మొత్తం 930 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో బాలానగర్, భూత్పూర్, గండేడ్, మహమ్మదాబాద్, జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్‌పేట, రాజాపూర్ మండలాల పరిధిలోని 8 జెడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు 484 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతాయి. అలాగే రెండో విడతలో అడ్డాకుల, చిన్నచింతకుంట, దేవరకద్ర, హన్వాడ, కోయిల్‌కొండ, కౌకుంట్ల, మహబూబ్‌నగర్ రూరల్, మూసాపేట మండలాల పరిధిలోని 8 జెడ్పీటీసీ, 86 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు గాను 446 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు.